భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి ప్రభుత్వం ఏర్పాటుచేసి సరిగ్గా నేటికి ఏడేండ్లు పూర్తయ్యాయి. గత ఏడు సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది. కొన్ని నిర్ణయాలు ప్రతీ భారతీయుడిపై ప్రభావం చూపగా, మరికొన్ని పరోక్షంగా ప్రభావవంతం చేస్తున్నాయి. ఈ ఏడేండ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఏడు కీలక నిర్ణయాలు అన్నింటికన్నా దేశ ప్రజలు అందరిని ప్రభావితం చేశాయి.
పెద్ద నోట్ల రద్దు
2016 నవంబర్ 8.. అర్ధరాత్రి టీవీ ప్రత్యక్ష ప్రసారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 500, 1000 రూపాయల నోట్లు పనికిరానివని చెప్పారు. వాటిని బ్యాంకుల్లో జమ చేయడానికి అనుమతించారు. ఒకే ఒక్క నిర్ణయంతో 85 శాతం కరెన్సీని ప్రధాని కాగితంగా మార్చేశారు.
పాత 500, 1000 రూపాయల స్థానంలో కొత్తగా 500, 2000 నోట్లు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో దేశంలోని ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కట్టడానికి తమ సమయాన్నంతా వెచ్చించారు. డీమోనిటైజేషన్ తర్వాత 21 నెలలకు రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, డీమోనిటైజేషన్ సమయంలో రిజర్వ్ బ్యాంకులో జమ చేసిన మొత్తం 500, 1000 నోట్ల విలువ రూ.15.31 లక్షల కోట్లు. అంటే, 99.3% డబ్బు రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చింది.
సర్జికల్ స్ట్రైక్
2016 డిసెంబర్ 28 అర్ధరాత్రి సమయంలో సరిహద్దుకు ఆవల పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్ పట్టణంపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషె మహ్మద్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శత్రుదేశంలోకి ప్రవేశించి మరీ వైమానికదాడులు చేయడం ఇదే తొలిసారి.
వైమానిక దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ విమానం నియంత్రణ రేఖను దాటి భారత సరిహద్దులోకి ప్రవేశించి బాంబు దాడి చేసింది. పాక్ విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన భారతదేశ మిగ్ -21 పాకిస్తాన్ సరిహద్దులో పడింది. ఈ విమానంలోని వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ అరెస్టు చేసింది. అయితే, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ఆయనను రెండు రోజుల తర్వాత పాకిస్తాన్ విడుదల చేసింది.
ఒకే పన్ను విధానం – జీఎస్టీ
2017 జూలై 1.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసి జీఎస్టీని తీసుకొచ్చారు. దీనిని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ చట్టం 2016గా ప్రవేశపెట్టారు.
ఈ విధానంతో పన్ను వ్యత్యాసం పరిష్కరించబడింది. ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒకే విధమైన పన్ను విధించబడుతున్నది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతున్నది. అనేక మార్పుల తర్వాత ఈ ప్రక్రియ ఇప్పుడు సున్నితంగా తయారైంది. పెట్రోలియం ఉత్పత్తులు, ఎక్సైజ్‌లను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఫలితంగా వీటి ధరలు అందనంత ఎత్తుకు పోతున్నాయి.
ట్రిపుల్ తలాక్ కు స్వస్తి
2018 డిసెంబర్ 19.. ముస్లిం మహిళలకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రబుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ముస్లిం మహిళ (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లు 2019 నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం.
ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశమున్నది. ముస్లిం మహిళలకు భరణం / పరిహారం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 5-10 శాతానికి పడిపోయాయి.
ఆర్టికల్ 370 రద్దు
2019 ఆగస్టు 5.. భారత రాజ్యాంగంలోని జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో జమ్ముకశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి.
ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అంగీకరించలేదు. పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంటర్నెట్‌తో సహా కమ్యూనికేషన్ సదుపాయాలను నిలిపివేయాల్సి వచ్చింది. పర్యాటక రంగం ప్రభావితమైంది.
దీని తర్వాత ఆర్టికల్ 35ఏ రద్దు అంశం కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. జమ్ము కశ్మీర్‌ను రెండు భాగాలుగా జమ్ము- కశ్మీర్, లఢఖ్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లఢక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం
2020 జనవరి 10.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమలులోకి తీసుకొచ్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర (హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, పార్సీ, క్రిస్టియన్) కు పౌరసత్వం ఇవ్వడం ఈ చట్టం ముఖ్యోద్దేశం.
ఇంతకుముందు ఈ ప్రజలు భారతదేశ పౌరసత్వం పొందడానికి 11 సంవత్సరాలు భారతదేశంలో నివసించాల్సి వచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లు తర్వాత ఈ కాలాన్ని 11 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు తగ్గించారు. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరిస్తుంది.
చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. చట్టంతో చాలా సంవత్సరాలు భారతదేశంలో నివసిస్తున్నవారు భారత పౌరసత్వం పొందడం సులభమైంది.
ప్రభుత్వ బ్యాంకుల విలీనం
2020 ఏప్రిల్ 1 పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా రూపొందించే నిర్ణయానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి.
సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీంతో వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు లభించడం మొదలైంది. బ్యాంకుల ఖర్చు తగ్గింది. బ్యాంకుల ఉత్పాదకత పెరిగింది. టెక్నాలజీలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వచ్చింది. దీంతో ప్రైవేటు బ్యాంకులతో మెరుగ్గా పోటీ పడటానికి ప్రయత్నిస్తున్నారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!