మయన్మార్‌లో అంతర్యుద్ధం… యు ఎన్ హెచ్చరిక 

మయన్మార్‌లో అంతర్యుద్ధం జ‌రిగే అవకాశాలు ఉన్నాయంటూ ఐక్య‌రాజ్య స‌మితి హెచ్చ‌రించింది. మిలిటరీ జుంటాకు వ్యతిరేకంగా ప్రజలు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారని, నిరసనకారులు ఇంట్లో తయారుచేసుకుంటున్న‌ ఆయుధాలను ఉపయోగించి రక్షణాత్మక విధానాన్ని తీసుకోవటానికి బదులు దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించార‌ని పేర్కొన్న‌ది. 

ఇదే స‌మ‌యంలో మయన్మార్‌లోని ఒక వార్తా ప‌త్రిక‌ సంపాదకుడు డానీ ఫెన్స్ట‌ర్‌ను సైన్యం అరెస్టు చేసింది. సైనిక తిరుగుబాటు తర్వాత ఇది నాలుగో విదేశీ జర్నలిస్ట్ అరెస్ట్ కావ‌డం విశేషం. 

ఐక్యరాజ్యసమితి డిజిటల్ మీడియా సమావేశంలో యూఎన్ ప్ర‌త్యేక ప్ర‌తినిది క్రిస్రిన్ ష్రైనర్ బెర్జ్నర్ మాట్లాడుతూ ప్రజలు సైనిక దాడులకు భయపడుతున్నందున వారు త‌మ ఆత్మరక్షణ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆ దేశ ప్రజలు సైనిక పాలన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె తెలిపారు. స్వీయ రక్షణ దాడుల నుంచి ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నారని ఆమె చెప్పారు. 

ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టి సైన్యం అధికారం చేప‌ట్టింద‌ని, అప్ప‌టి నుంచి విస్తృత‌మైన హింస‌ను నిత్యం చూస్తున్నామ‌ని ఆమె విచారం వ్య‌క్తం చేశారు. ఇప్పటికే చిన్, కయా, కరెన్నీ రాష్ట్రాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు.

ఇది దేశంలో అంత‌ర్యుద్ధానికి దారితీసే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని ఆమె  హెచ్చరించారు. “చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించడం అంత సులభం కాదు. కాని మరింత రక్తపాతం, సుదీర్ఘమైన అంతర్యుద్ధాన్ని నివారించడానికి ముందుకురావాలి” అని స్పష్టం చేశారు.

“ఇక్క‌డి పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. దేశం సాధారణ స్థితికి రావడాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ దేశ‌ ప్రజలు నిర్ణయించుకోవాలని మేం కోరుకుంటున్నాం” అని బెర్జ్నర్ చెప్పారు. మయన్మార్ పరిస్థితిని చాలా ఘోరంగా అభివర్ణించిన బెర్జ్నర్  ఇప్ప‌టివ‌ర‌కు మ‌య‌న్మార్‌లో 800 మందికి పైగా మరణించారని, దాదాపు 5,300 మందిని అరెస్టు చేశారని, 1,800 మందికి పైగా సైన్యం అరెస్ట్ వారెంట్లు జారీ చేసిందని చెప్పారు.

దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో 2015లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డి) పార్టీ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డికి 82 శాతం పౌరులు మద్దతు తెలిపారు. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైనిక పాలకులు ఆరోపిస్తూ గత ఫిబ్రవరి 1న ఆమె పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేశారు.