ఐక్యరాజ్య సమితి వ్యవస్థల్లో పెరుగుతున్న చైనా భావం 

అంతర్జాతీయ, బహుళజాతి సంస్థలలో తన పలుకుబడి పెంచుకోవడానికి గత దశాబ్దకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న చైనా ఐక్యరాజ్య సమితిలోని వ్యవస్థలతోపాటు ఇతర ప్రధాన రంగాల్లోనూ ఆధిక్యతను సాధించడంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించింది. దాదాపు ఎదురు లేనంతగా ఈ ఎదుగుదల ఉందని తాజాగా విడుదలైన గేట్‌వే హౌస్ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2020-21లో నాలుగు నెలలపాటు ఈ అధ్యయనం జరిగిందని గేట్‌వే హౌస్ పేర్కొంది.

ఐక్యరాజ్య సమితి వ్యవస్థలు, నిధి సంస్థలు, కార్యక్రమాల సంస్థలు, ఐక్యరాజ్య సమితికి సంబంధం లేని ఇతర భద్రత, ఆర్థిక, సైంటిఫిక్ ఏజెన్సీలకు చైనా నుంచి వస్తున్న నిధులపై ఈ అధ్యయనం జరిగిందని తెలిపింది. బహుపాక్షిక వ్యవస్థల్లో సిబ్బంది, నిధుల విషయంలో చైనా ఆధిక్యత కనిపిస్తోందని తెలిపింది.

చైనా ప్రాబల్యం అధికంగా ఉన్న చాలా ముఖ్యమైన సంస్థల్లో కొన్ని ఏమిటంటే, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, యూఎన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలను నిర్ణయించే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్‌లో ప్రధాన భాగస్వామి చైనాకు చెందిన హువావేయి కంపెనీ అని ఈ నివేదిక పేర్కొంది.

గగనతల ప్రయాణాలు, భద్రతా ప్రమాణాలను నిర్ణయించే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో చైనా ఆధిపత్యం వల్ల కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన చర్చల్లో తైవాన్ పాల్గొనకుండా నిరోధించగలిగిందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో కూడా చైనాకు గట్టి పలుకుబడి ఉన్నట్లు తెలిపింది.

మానవ హక్కుల విషయంలో చైనా రికార్డు అంతంత మాత్రమే. అయినప్పటికీ 2020 అక్టోబరులో 15మంది కొత్త సభ్యుల ఎన్నిక కోసం ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి నిర్వహించిన ఎన్నికల్లో చైనా గెలిచిందని తెలిపింది.  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా మే 4న  చైనా వైస్ మినిస్టర్ జియాంగ్చెన్ ఝాంగ్ నియమితులయ్యారు. డబ్ల్యూటీఓలో మొత్తం నలుగురు డిప్యూటీ డైరెక్టర్స్ జనరల్‌ ఉంటారు. మిగిలిన ముగ్గురు అమెరికా, ఫ్రాన్స్, కోస్టారికాలకు చెందినవారు.

ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు చైనా 1992 నుంచి కచ్చితమైన ఎజెండాతో దూసుకెళ్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. 1997 నాటికి 20 శాతం మల్టీలేటరల్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వాలు సాధించగలిగిందని తెలిపింది. 2002 నుంచి కొత్త వ్యవస్థలను సృష్టించడం ప్రారంభించిందని, దీనికి ఉదాహరణ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పేర్కొంది.

చైనా 2001లో డబ్ల్యూటీవోలో ప్రవేశించినప్పటి నుంచి అంతర్జాతీయ బహుపాక్షిక వ్యవస్థలను (రెండు లేదా అంతకన్నా ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం ఉండే వ్యవస్థలను) ప్రభావితం చేయడం ప్రారంభించిందని పేర్కొంది.

దేశీయంగా ఏర్పాటు చేసుకున్న ఎజెండాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పలుకుబడిని పెంచుకునేందుకు జాగ్రత్తగా ప్రణాళికలను రచించి, అమలు చేస్తోందని తెలిపింది. వీటన్నిటినీ చైనా విదేశాంగ విధానాలకు కూడా ముడిపెట్టిందని వివరించింది. ఐక్య రాజ్య సమితి వ్యవస్థలకు నిధులను అందజేయడం ద్వారా కూడా తన పలుకుబడిని చైనా పెంచుకుంటోందని తెలిపింది. అన్ని ముఖ్యమైన అంతర్జాతీయ వ్యవస్థలకు అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవులను చైనా దక్కించుకుందని పేర్కొంది.