వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా… వాల్‌స్ట్రీట్ జర్నల్ 

చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందన్న ఆరోపణలకు రోజురోజుకూ బలం చేకూరుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు జరుపుతుండగానే దానికి మరింత ఆధారాలతో కూడిన నివేదిక తాజాగా బయటపడింది.

కరోనా మహమ్మారి రూపం దాల్చడానికి ముందు వుహాన్ పరిశోధన శాల నుంచి లీకైనట్టు ఇప్పటికే అణుశాస్త్రవేత్తల జర్నల్ ‘బులెటిన్ ఓఆర్‌జి’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించగా, ఇప్పుడు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఫ్యాక్ట్‌షీట్‌లోని విషయాలు బయటకు రావడం, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికల ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించడం మరింత సంచలనం సృష్టిస్తోంది.

ఈ కథనాలు మరోసారి చైనా పాత్రను ప్రశ్నిస్తున్నాయి. తాజాగా డబ్లుహెచ్‌ఒ డెసిషన్ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్టు ప్రస్తావనకు వచ్చింది. కరోనా పుట్టుకపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్టును ప్రధానంగా పరిశీలించాలని డబ్లుహెచ్‌ఒ ప్యానెల్ నిర్ణయించుకుంది.

కొవిడ్‌కు కారణమవుతున్న సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు నిర్వహించే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కథనం ప్రచురించడం విశేషం. సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ చైనాలో ల్యాబ్‌ నుంచి లీక్‌ కాలేదని, ప్రకృతిలో సహజంగానే పుట్టి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌వో మార్చిలో ప్రకటించింది. 

అయితే వైరస్‌ పుట్టుకపై మరింత లోతుగా దర్యాప్తు జరుపాలని బ్రిటన్‌, అమెరికా శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ అంశంపై మళ్లీ సమావేశం అవుతున్నది. ఈ ఆరోపణల్లో దేనికీ చైనా ఆధారాలు చూపించి ఖండించ లేదు. ఇదంతా కేవలం తమపై దుష్ప్రచారం గానే కొట్టి పారేసింది.

కరోనా విజృంభణ కాక ముందు 2019 నవంబర్‌లో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ల్యాబ్ చాలా గోప్యంగా ఉంచింది. ఆస్పత్రి బయట కూడా గట్టి కాపలా పెట్టింది. ల్యాబ్ సిబ్బంది ముగ్గురూ కొవిడ్ 19 లక్షణాలతోపాటు సీజనల్ జబ్బులతో ఆస్పత్రుల్లో చేరారని అమెరికా నిఘా విభాగం నివేదిక పేర్కొంది. ఈ అనుమానాలన్నీ కరోనా వైరస్ వూహ్యాన్‌ల్యాబ్ సృష్టి అనే వాదనను బలపరుస్తున్నాయని నివేదిక వెల్లడించింది. 

ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో వైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీ ల్యాండ్‌లో ఫోర్ట్ డెట్రిక్ సైనిక స్థావరం లోని ల్యాబ్ నుంచి వచ్చిందని చైనా ఆరోపిస్తోంది.

అంతేకాదు దీనిపై ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిక అందచేసింది. అయితే వుహాన్ ల్యాబ్ పరిశోధకులు వైద్య చికిత్స గురించి ట్రంప్ హయాం లోనే రిపోర్టు తయారైనప్పటికీ బైడెన్ కార్యాలయం దీనిపై స్పందించట్లేదు వుహాన్‌లో 2019 డిసెంబర్ 8న తొలి సార్స్‌కొవ్2 కేసు నమోదైంది.

కానీ చాలా మంది వైరాలజిస్టులు, అంటువ్యాధుల చికిత్స నిపుణులు మాత్రం అది 2019 నవంబర్ లోనే వుహాన్‌లో వ్యాపించి ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు.

సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ సహజంగా వృద్ధిచెందిందంటే తనకు నమ్మకం కలగడం లేదని, వైరస్‌ పుట్టుకపై లోతైన దర్యాప్తు నిర్వహించాలని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు అంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. ‘కరోనా సహజంగానే పుట్టి ఉంటుందని ఇంకా నమ్ముతున్నారా’ అని ప్రశ్నించగా ‘నాకైతే నమ్మకం కలగడం లేదు’ అని బదులిచ్చారు. ‘చైనాలో ఏం జరిగిందనేదానిపై లోతైన దర్యాప్తు నిర్వహించాలి. వైరస్‌ పుట్టుకను తెలుసుకొనేందుకు పారదర్శక దర్యాప్తునకు నేను మద్దతిస్తాను’ అని అన్నారు.