యాప్ తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు అమిత్ షా అప్రమత్తం 

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్‌ తుపాను కారణంగా ప్రభావిత ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఒడిషాపై తుపాన్‌ అత్యధిక ప్రభావం చూపుతుందని, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరకోస్తాపై కూడా భారీ ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తాలో ఒకమోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రానికి పోర్టు బ్లెయిర్‌ (అండమాన్‌ దీవులు)కు ఉత్తర వాయువ్యంగా 620 కిలోమీటర్లు, పరాదీప్‌ (ఒడిశా)కు దక్షిణ ఆగేయంగా 530 కిలోమీటర్లు, బాలాసోర్‌ (ఒడిశా)కి 630 కిలోమీటర్ల దూరంలో ఆగేయ దిశగా తుపాన్‌ కేంద్రీకృతమై ఉంది. ఇది రాన్ను 24 గంటల్లో మరింత బలోపేతం కానుంది మంగళవారం అర్ధరాత్రికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. 

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనరు కన్నబాబు పేర్కొన్నారు. సముద్రంలో అలలు 2.9,నుండి 4.5 మీటర్ల ఎత్తుతో ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని తీర, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కఅష్ణపట్నం ఓడ రేవుల్లో రెండు నంబర్‌, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

యాస్‌ తుపాను సన్నద్ధతపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు ఇందులో పాల్గొన్నారు.  తూర్పు తీరంలోని 24 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలతోపాటు కోవిడ్‌ ఆస్పత్రులు, లేబరేటరీలు, వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్స్‌ వద్ద విద్యుత్‌ సరఫరా బ్యాకప్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. 

అవసరమైతే రోగుల తరలింపునకు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి సూచించారు.  ‘యాస్‌’ ప్రభావం ఆక్సిజన్‌ ఉత్పత్తి కర్మాగారాలపై ఎలా ఉంటుందనేది ముందస్తుగా అంచనా వేసుకొని.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రులకు అమిత్‌షా సూచించారు. ‘‘కొవిడ్‌ రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ను రెండురోజులపాటు భారీగా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేటాయించిన ఆక్సిజన్‌ ట్యాంకర్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాంట్లలో నిరంతర ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ ఆస్పత్రులు, బాధితులపై యాస్‌ ప్రభావం పడకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 

కొవిడ్‌ ఆస్పత్రులు, ప్రయోగశాలలు, వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్లు, ఇతర వైద్య సదుపాయాలకు విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలగనీయొద్దు. అవసరమైన ఆక్సిజన్‌, ఔషధాలు, అత్యవసర పరికరాలను ముందస్తుగా  సమకూర్చుకోవాలి. ఆక్సిజన్‌ వాహనాల రాకపోకలకు తుఫాను ప్రభావంవల్ల అంతరాయం కలగకుండా చూడాలని అమిత్ షా వివరించారు. 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సకాలంలో విద్యుత్‌, నీటి సరఫరా, టెలికమ్యూనికేషన్‌ సౌకర్యాలను పునరుద్ధరించాలని, ఈ ప్రాంతాల్లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న రోగులు ఎక్కువ మంది ఉన్నారని మంత్రి గుర్తు చేశారు.  షిప్పింగ్‌, షిషింగ్‌ నౌకలు, నౌకాశ్రయల పరిస్థితిపైనా మంత్రి సమీక్షించారు. సముద్రంలో చిక్కుకున్న జాలర్లను తిరిగి తీసుకుని రావాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్రాలకు సూచించారు.