తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష

రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష’ను తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం  రాష్ట్రవ్యాప్తంగా తమ తమ నివాసాలలో  దీక్ష చేపట్టారు. 
 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్రా ష్ట్ర కార్యాలయంలో కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ దీక్ష చేపట్టారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ పోరాటాలతోనే సీఎం ఫాంహౌస్ నుంచి బయటకొచ్చిండని సంజయ్ తెలిపారు. బీజేపీ ఓత్తిడితోనే కేసీఆర్ రెండు హాస్పిటల్స్ సందర్శించారని చెప్పారు.
తెలంగాణలో రైతు ఏడుస్తున్నాడని అంటూ  కేసీఆర్ వి ఊకదంపుడు ఉపన్యాసాలని పేర్కొన్నారు. ఉచితంగా యూరియా, విత్తనాలు ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతూ తడిసిన, రంగు మారిన ధాన్యం కొనాలని, రైతుబంధు ఇవ్వాలని, రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించొద్దని ఆయన హితవు చెప్పారు.
 
కొనుగోలు పూర్తైనా అకౌంట్లో డబ్బులు పడడం లేదని దయ్యబట్టారు.. కనీసం 75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు కమీషన్ ఏజెంట్లుగా మారారని విమర్శించారు. అప్పుల పాలైతుంటే కేసీఆర్ కోట్లకు పడగలెత్తుతుండన్నారని ఆయన  ధ్వజమెత్తారు. 

మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తన నివాసంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆమె తూర్పరాబట్టారు. సీఎం కేసీఆర్ వరంగల్‌‌కు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఇప్పుడు కొత్త హామీలను ఇస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. 

‘అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. తద్వారా రైతులను ఆదుకోవాలి. ఈ లాక్‌డౌన్ సమయంలో రైతులకు రవాణా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. రైతులకు రుణమాఫీ, రైతు బంధు, నష్ట పరిహారం ఇవ్వాలి’ అని విజయశాంతి డిమాండ్ చేశారు.