ఆనందయ్య మందును అడ్డుకొంటున్నదెవ్వరు? 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనాకు అంటూ ఇస్తున్న మందుపై అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నది ఎవ్వరు? బలవంతంగా పోలీసులను ఉపయోగించి ఈ మందు పంపిణీని అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మందులో ఎటువంటి హానికర అంశాలను లేవని ఆయుష్ నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు.

పైగా దీనిని నాటు మందు అని ఆయుష్ కమీషనర్ రాములు తేల్చడంతో దీని పంపిణీకి ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదని స్వయంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా స్పష్టం చేశారు. అయినా ఇంకా ఎందుకు పంపిణీకి అడ్డుకొంటున్నారు? పైగా దాదాపు అన్ని రాజకీయ పక్షాల నాయకులు సహితం దీనిని పంపిణి చేయాలని కోరుకొంటున్నారు.

ఇదంతా తన అధికార పరిధిలో లేని ఈ అంశంలో తలదూర్చిన ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరావు ఈ మందు వివాదస్పదంగా మారడానికి ప్రధాన కారకుడని చెప్పక తప్పదు. ఈ విషయమై ఆయనకు గల ఆసక్తి ఏమిటి అంతుబట్టడం లేదు. ప్రభుత్వంలో జరిగే అవినీతి అంశాల గురించి దర్యాప్తు జరపవలసిన లోకాయుక్తకు ప్రభుత్వం నిధులతో ఏమాత్రం సంబంధం లేని ఆనందయ్య మందు గురించి సుమోటోగా కేసు నమోదు చేసి, పంపిణి చేయడానికి వీల్లేదని మొదటగా అడ్డంకులు కల్పించింది ఆయనే కదా.

సోమవారం వరకు ఆయుష్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఇసిఎంఆర్ ప్రతినిధి వర్గం వచ్చి, ఈ మందును పరిశీలించి, నివేదిక ఇవ్వాలి అంటే ఆలస్యం జరుగక తప్పదు. వీరందరి సిఫార్సు ఉంటేతప్పా ఈ మందు పంపిణికి అనుమతింపబోమని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేస్తున్నది. ఇదంతా ఎప్పటికి జరుగుతుంది?

కృష్ణపట్నంలో ఆనందయ్య మూడున్నర దశాబ్దాలుగా మందును ఇస్తున్నారని రాములు వివరించారు. ఆయన మందులో 18 రకాల ముడి పదార్థాలను వాడుతున్నారని తెలిపారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య మందులో వాడుతున్నారని వివరించారు. 

మందుల తయారీ విధానమంతా చూపించారని, ఇవన్నీ సహజంగా దొరికేవేనని,  వేరేవేవీ వాడడం లేదని వెల్లడించారు. తయారీ ఫార్ములాను కూడా తమకు వివరించారని చెప్పారు. అయినా ఇప్పుడే ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి? ప్రభుత్వం కాలయాపన ద్వారా ఈ మందు పంపిణి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నది.

ఈ మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, ఇంకొన్ని రావాల్సి ఉందని రాములు చెప్పారు. ఇంకా ఈ మందు శాంపిళ్లను సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌  రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ స్టడీస్‌  (సీసీఆర్‌ఎఎ్‌స)కు పంపామని వెల్లడించారు. టీటీడీ సహకారంతో పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. 

సీసీఆర్‌ఎఎస్‌ వాళ్లు ఈ శాంపిళ్లను 500 మందిపై ప్రయోగించి పరిశీలన చేస్తారని చెప్పారు. ఈ మందు వినియోగం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అనేది తేలాల్సి ఉందని రాములు చెప్పారు.  ఇదంతా ఎప్పటికి జరిగెను?

కృష్ణపట్నంలో స్థానిక ఎమ్యెల్యే అయిన, జిల్లా వైసిపి అధ్యక్షుడు కాకాని గోవర్ధనరెడ్డి స్వయంగా ఈ మందు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. తిరుపతిలో మరో వైసిపి ఎమ్యెల్యే చెవిటిరెడ్డి భాస్కరరెడ్డి టిటిడి నిపుణుల బృందానికి సారధ్యం వహిస్తూ ఈ మందును పెద్దఎత్తున తయారుకు సన్నాహాలు చేస్తున్నారు.

బిజెపి,  టిడిపి నేతలు ఈ మందు పంపిణి నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం కృష్ణపట్నం సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మందు తయారీకి వాడుతున్న పదార్థాలను, దినుసులను పరిశీలించారు. మందు పంపిణీని అడ్డుకోవడానికి కార్పొరేట్‌ మెడికల్‌ మాఫియా ప్రయత్నిస్తోందని అంటూ ధ్వజమెత్తారు.

ఎవ్వరికీ అభ్యంతరం లేని ఈ మందు పంపిణీకి అసలు ప్రభుత్వ అనుమతి ఎందుకు? మన ఇళ్లల్లో, గ్రామాలలో, గిరిజన ప్రాంతాలలో అనేక చిట్కా వైద్యాలు అనుసరిస్తున్నాము. వాటికి ప్రభుత్వ అనుమతి ఇస్తుందా? ఇప్పటి మందు తీసుకున్న వారెవ్వరిలో  దుషఫలితాలు కలిగించిన సూచనలు లేకపోయినా ఇంకా మందు పంపిణీకి అడ్డంకులు కల్పించడంలో అర్ధం లేదు.

ఈ విషయమై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం `రహస్య అజెండా’తో వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పలువురు విమర్శిస్తున్న విధంగా ఆసుపత్రులు, డ్రగ్ మాఫియా వత్తిడులు పనిచేస్తున్నాయా? ఈ విషయమై ప్రభుత్వం తక్షణం తన నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంది.

ఇలా  ఉండగా,కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం హైకోర్టులో వేర్వేరుగా రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లిఖార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఆయుర్వేద మందు పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని న్యాయవాది మల్లిఖార్జునరావు కోరారు. ఆనందయ్య మందును కొవిడ్‌కు చికిత్సకు అందించే ఆయుర్వేద మందుగా ప్రకటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఉమామహేశ్వరనాయుడు కోరారు. ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు పంపీణీకి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వెకేషన్‌ అధికారిని కోరారు.