రైతులు ధర్నా ప్రాంతంలో కోవిద్ వ్యాప్తిపై ఎన్‌హెచ్ఆర్‌సీ

రైతులు ధర్నా ప్రాంతంలో కోవిద్ వ్యాప్తిపై ఎన్‌హెచ్ఆర్‌సీ

రైతులు ధర్నా చేస్తున్న ప్రదేశాల్లో కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) మూడు రాష్ట్రాలను ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన మార్గదర్శకాలను నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న రైతులు పాటించడం లేదని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరుపుతోంది.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్న రైతులు కోవిడ్-19 మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి పాటించవలసిన మార్గదర్శకాలను పాటించడం లేదు. ఈ వైఖరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమ, నిబంధనలకు, ఎన్‌హెచ్ఆర్‌సీ జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకం. 

రోజు రోజుకూ పెద్ద సంఖ్యలో రైతులు ఈ ధర్నా ప్రదేశాలకు చేరుకుంటుండటంతో ఈ దయనీయ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. ఈ రైతులు తమ జీవితాలను పణంగా పెట్టడం మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు ఈ వైరస్ వాహకులుగా మారే అవకాశం ఉంది. 

ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారిలో దాదాపు 300 మంది రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి వ్యాధులు కూడా తీవ్రంగా కనిపిస్తున్నాయి. 

మే 26న బ్లాక్ డే నిర్వహించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. దీనిని విచారణకు చేపట్టిన ఎన్‌హెచ్ఆర్‌సీ మంగళవారం ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న  ప్రదేశాల వద్ద కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరింది. నాలుగు వారాల్లోగా నివేదికలను సమర్పించాలని కోరింది. ఈ నోటీసులను ఈ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించింది.

దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు అష్ట దిగ్బంధనం, కట్టడి ప్రాంతాలు వంటి చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొంది. ఇటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రాణాలను కాపాడుకోవటమే మనందరి కర్తవ్యం కావాలని తెలిపింది.