లాక్ డౌన్, ఆంక్షల కారణంగా రూ.5 లక్షల కోట్ల నష్టం

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం కారణంగా దేశంలో అమలవుతున్న లాక్ డౌన్, ఇతర ఆంక్షల వంటి అష్ట దిగ్బంధనాల వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు రూ.5 లక్షల కోట్ల మేరకు నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో సంభవించిన నష్టం రూ.11 లక్షల కోట్లు అని వివరించారు.

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) పరిశోధన నివేదిక ప్రకారం, ప్రస్తుత త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్లు అని అంచనా. బార్‌క్లేస్ అంచనా ప్రకారం, ఇది రూ.5.4 లక్షల కోట్లు. ఎస్‌బీఐ, బార్‌క్లేస్ అంచనాల ప్రకారం వాస్తవ జీడీపీ వృద్ధి 10 నుంచి 15 శాతం వరకు ఉంటుంది. అయితే ఇది 26.2 శాతం ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా వేసింది. 

మూడో త్రైమాసికంలో కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం వస్తే వృద్ధి రేటు నేల చూపులు చూస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అదే జరిగితే మరో రూ.3 లక్షల కోట్లు నష్టపోవలసి వస్తుందని, ఫలితంగా వార్షిక వృద్ధి రేటు దాదాపు 3 శాతం తగ్గుతుందని, సుమారు 8 శాతానికి పరిమితమవుతుందని తెలిపారు. 

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం రావడానికి కొన్ని వారాల ముందు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు 10 నుంచి 12 శాతంగా ఉండేవి. ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే, రెండో ప్రభంజనం ప్రభావం వాస్తవ ఆర్థిక వ్యవస్థపై పరిమితంగా ఉంటుందని మొదట్లో భావించారు. 

2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్ల వరకు ఉండవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్ల నష్టం జరిగింది. వాస్తవ జీడీపీ నష్టం  రూ.4.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. 

బార్‌క్లేస్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్ఫెక్షన్లు తగ్గుతున్నప్పటికీ, కఠినమైన అష్ట దిగ్బంధనాల వల్ల సాపేక్ష ఆర్థిక వ్యయాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్‌లో నిలకడగా ఉన్న తర్వాత మే నెలలో కార్యకలాపాలు క్షీణించాయి. 

ఈ అష్ట దిగ్బంధనాలు జూన్ నెలాఖరు వరకు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమైతే, 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.5.4 లక్షల కోట్ల మేరకు నష్టం జరగవచ్చు. మూడో ప్రభంజనం కూడా వస్తే, దాదాపు ఎనిమిది వారాల పాటు అష్ట దిగ్బంధనం అమలు చేస్తే, మరొక రూ.3.1 లక్షల కోట్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.