బెంగాల్ హింసపై మమతాకు సుప్రీం నోటీసు 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాకాండపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ ప్రేరేపిత హింసను నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ నోటీసులు ఇచ్చింది. 
 
బెంగాల్ ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. ఇద్దరు లాయర్లు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలు ఈ పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ పింకీ ఆనంద్ కోర్టు ముందు హాజరయ్యారు. ఎన్నికల అనంతర చెలరేగిన హింసాకాండపై ‘సిట్’ చేత దర్యాప్తు చేయించాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు.
 
దీనిపై న్యాయమూర్తులు వినీత్ శరణ, బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్కానం బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. జూన్ 7లోగా కోర్టుకు సమాధానం తెలియజేయాలని పేర్కొంటూ తదుపరి విచారణను జూన్ రెండో వారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో హింస పెట్రేగిపోవ‌డానికి ప్ర‌భుత్వం, డీజీపీ కార‌ణ‌మంటూ ఆ అఫిడ‌విట్‌లో ఆరోపించారు. ఎన్నిక‌ల త‌ర్వాత బాంబు దాడులు, హ‌త్య‌లు, గ్యాంగ్ రేప్‌లు, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర‌చ‌డం, లూటీలు, కిడ్నాప్‌లు, విధ్వంసాలు, ప్ర‌భుత్వ ఆస్తి న‌ష్టం లాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు పిటిష‌న్‌లో ఆరోపించారు.

మరోవంక, ప‌శ్చిమ బెంగాల్ డీజీపిక ఇవాళ జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజ‌రుకావాలంటూ త‌న నోటీసుల్లో పేర్కొన్న‌ది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న హింస గురించి మహిళా క‌మిష‌న్ సీరియ‌స్‌గా ఉన్న‌ది. తాము ఫార్వ‌ర్డ్ చేసిన ఫిర్యాదుల‌పై డీజీపీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో తెలుసుకోనున్న‌ట్లు మ‌హిళా క‌మిష‌న్ పేర్కొన్న‌ది. జిల్లాల వారిగా మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న నేరాల వివ‌రాల‌ను కూడా మ‌హిళా క‌మిష‌న్ కోరింది.  

ఇలా ఉండగా, ఎన్నికల అనంతరం బెంగాల్ లో జరిగిన హింసను పరిగణలోకి తీసుకొని తగిన దర్యాప్తు జరిపి, సంఘటనలపై ఎఫ్ ఐ ఆర్ ల నమోదు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలను కోరుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకు దేశవ్యాప్తంగా గల 2,000 మందికి పైగా మహిళా న్యాయవాదులు ఒక లేఖ వ్రాసారు. వీరిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన న్యాయవాదులు కూడా ఉన్నారు. 
 
మే 2 నుండి జరిగిన హింసలు మహిళలు, బాలలను కూడా వదిలి పెట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హింస కారణంగా ఆ రాష్ట్రంలో `రాజ్యాంగ సంక్షోభం’ ఏర్పడినది, సాధారణ పౌరుల పరిస్థితి దుర్భరంగా మారినదని వారు పేర్కొన్నారు. పోలీసులు రౌడీ మూకలతో చేతులు కలపడంతో బాధితులు కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం లేకపోయినదని వారు తెలిపారు. 
 
బాధితుల ఫిర్యాదుల నమోదుకు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నోడెల్ అధికారిని నియమించాలని వారు సుప్రీం కోర్ట్ ను కోరారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మృతి చెందిన, గాయపడిన వారందరికీ తగు పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.