తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మళ్లీ బ్రేక్ 

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మళ్లీ బ్రేక్ 

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మళ్లీ బ్రేక్ పడింది. ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్ తప్పని సరి చేయడంతో రాష్ట్ర సరిహద్దులలో పోలీసులు ఆంక్షలు విధించారు. లాక్‌డౌన్ మినహాయింపు వేళల్లోనూ సాధారణ వాహనాలు తిరిగేందుకు వీలు లేకుండా పోయింది. అయితే అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలను దీని నుంచి మినహాయించారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగిలినవారు తెలంగాణ పోలీసుల నుంచి ఈ పాస్‌ (అనుమతి) తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇకనుంచి తెలంగాణ ఈ పాస్‌లు ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెక్‌పోస్టుల వద్ద ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్న జనాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి వచ్చే వారికి నేటి నుంచి ఈ-పాస్‌లు తప్పని సరి చేశారు.

సూర్యాపేట జిల్లాకు ఏపీ సరిహద్దు ప్రాంతాలైన దొండపాడు ఎస్‌ రోడ్డు, చింతలపాలెం, మఠంపల్లి వద్ద అత్యవసర సేవల వాహనాలు మినహా ఇతరల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్ ఆదేశాలు జారీ చేశారు.

సూర్యాపేట జిల్లాలోని నాలుగింటిలో మూడు చెక్‌పోస్టులను నేటి నుంచి మూసేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడ మీదుగానే ఏపీ వాహనాలను అనుమతిస్తున్నారు. హైవే మీదుగానే అందరూ తెలంగాణలోకి రావాలని మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్‌పోస్టులను మూసేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

తెలంగాణలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు సడలించినప్పటికీ ఆ సమయంలో వచ్చిన వాహనాలను ఎందుకు అనుమతించడంలేదంటూ పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపు ఉందని పాస్‌లు లేకుండా భారీగా వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

తాజా ఉత్తర్వులతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ గందరగోళం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సూర్యాపేట ఎస్పీ ఇచ్చిన ఉత్తర్వులు ప్రజలకు వెంటనే చేరే అవకాశం కనిపించడంలేదు. ఆది, సోమవారాల్లో ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాల కోసం వచ్చివెళ్లేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దానితో తెలంగాణ పోలీసుల తాజా ఆదేశాలు సామాన్య ప్రజలపై పెను ప్రభావం చూపనున్నాయి.