వై కేటగిరి భద్రత వెనక్కి తీసుమన్న  బీజేపీ ఎంపీ

పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కేంద్రం తనకు కల్పించిన ‘వై’ కేటగిరి భద్రతను తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరుతూ  కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాకాండ పెచ్చరిల్లిందని, మహిళలను తాను రక్షించలేనని భావించినందున తనకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రతను వెనక్కి తీసుకోవాలని ఛటర్జీ కోరారు.

ప్రజలు ఎంపీగా తనకు ఓటు వేసి ఎన్నుకున్నారని, కాని వారిని తాను రక్షించలేక పోయినపుడు తనకు వై కేటగిరి భద్రత ఎందుకని ఎంపీ ప్రశ్నించారు. రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి లాకెట్ ఛటర్జీ కేంద్రం ఇచ్చిన భద్రతను వెనక్కి పంపించాలని కోరడం బెంగాల్ లో సంచలనంగా మారింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారి దారుణాల వల్ల మరణిస్తున్నారని, వారికి రక్షణ లేదని లాకెట్ ఛటర్జీ విమర్శించారు. బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున చెలరేగిన హింస కారణంగా కేంద్రం పలువురు బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులకు ప్రత్యేక భద్రత కల్పించింది.