అల్లోపతిపై రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి 

అల్లోపతి వైద్యం, డాక్లర్లపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను బాబా రామ్‌దేవ్‌ ఉపసంహరించుకోవాలని, ఇచ్చిన వివరణ చాలదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని తేల్చి చెప్పారు.  అల్లోపతి వైద్యమంటే తమాషా కాదని తెలిపారు.

లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి, కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్‌ ఇచ్చిన వివరణ కూడా సరిపోదని పేర్కొన్నారు. తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్‌ లేఖ రాశారు.

కోవిడ్‌ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు.

కోవిడ్‌ను సామూహికంగా మాత్రమే ఎదుర్కోగలమని, ఇందుకోసం వైద్యులు, ఇతర సిబ్బంది అహోరాత్రాలు కష్టించి పనిచేస్తున్నారని హర్షవర్ధన్ తెలిపారు.  పోలియా, ఇబోలా, టీబీ లాంటి మహమ్మారి రోగాలకు అల్లోపతి వారే టీకాలను కనిపెట్టారన్న విషయాన్ని మరిచిపోరాదని కోరారు. 

తాజాగా వచ్చిన మహమ్మారి కరోనాకు సంబంధించిన టీకా కూడా అల్లోపతి వైద్య విధానం నుంచే వచ్చిందని హర్షవర్ధన్ తన లేఖలో రాందేవ్ బాబాకు గుర్తు చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో అల్లోపతి వైద్య విధానాన్ని తూలనాడుతూ మాట్లాడటం వల్ల తత్సంబంధిత వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, అలా మాట్లాడటం ఏమాత్రం సముచితంగా లేదని కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయని చెప్పారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని, అదొక , మూర్ఖపు విజ్ఙానం, తమాషా అంటూ రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించడం సబబు కాదని హితవు చెప్పారు. 

సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ప్రస్తుతం దేశంలో రికవరి రేటు 88 శాతంగా ఉందని, మరణాల రేటు 1.13 శాతంగా ఉందని, ఇదంతా అల్లోపతి వైద్య విధానంతోనే సాధ్యమని అన్నారు. ఏ వ్యాఖ్యలనైనా చేసేటప్పుడు కాల, మాన, పరిస్థితులు బేరీజు వేసుకొని మాట్లాడాలని హితవు పలికారు. 

కాగా, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరుతూ బాబా రాందేవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. తనకు వచ్చిన వాట్సాప్‌ సందేశాలను చదివానని, కానీ వాటిని తానే అన్నట్టుగా ఆపాదించి వీడియో విడుదల చేశారని వివరణ ఇచ్చారు.