అసోంలో ఏడుగురు ఉగ్రవాదులు హతం

అసోంలోని తిరుగుబాటు సంస్థ దిమాసా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ)కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కార్బి ఆంగ్లాంగ్‌ జిల్లాలో అసోం రైఫిల్స్‌, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఆదివారం తెల్లవారు జామున ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. 
 
ఈ ఘటనలో డీఎన్‌ఎల్‌ఏకు చెందిన ఏడుగురు మృతి చెందగా, సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అసోం స్పెషల్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ జీపీ సింగ్‌ ట్వీట్‌ చేశారు. నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 
 
ఈ  ఎన్‌కౌంటర్‌ డిమాసా నేషనల్‌ లిబిరేషన్‌ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు. సంస్థకు చెందిన ఇద్దరు అగ్ర నాయకులు సైతం ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లు ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై ఆదివారం మధ్యాహ్నం మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. 
 
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు ఘటనాస్థలంలోనే చనిపోయారని, ఘటనాస్థలంలో 3 ఏకే- 47లు, భారీగా పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.
 
అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్‌ జిల్లాల సరిహద్దులో ఆ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్‌ సోనోవాల్‌ ఆధ్వర్యంలో తిరుబాటుదారుల ఏరివేతకు భద్రతాదళాలు శనివారం రాత్రి ఆపరేషన్‌ చేపట్టాయి. అస్సాం పోలీసులు, అస్సాం రైఫిల్స్‌ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అస్సాంలోని డిమా హసావో, కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలతోపాటు నాగాలాండ్ సరిహద్దు జిల్లాల్లో డిమాసా నేషనల్‌ లిబిరేషన్‌ ఆర్మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
 
 దీనికి ముందు మే 14న అసోంలోని తీన్‌సుకియాలో గ్రనేడ్ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, అంతకంటే ముందు జిల్లాలో జరిగిన గ్రనేడ్ పేలుడులో ఒక మైనర్ మృతి చెందాడు.