నాసల్ వ్యాక్సిన్ గేమ్ చేంజర్ అవ్వచ్చు

కరోనాకు విరుగుడుగా భారత్ లో  తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్స్ గేమ్ చేంజర్ అవ్వొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో ఇది గేమ్ చేంజర్ లాగ మారొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. 

దేశంలో కరోనా మూడవ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. పిల్లలకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు తయారవుతున్నాయని చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటిన వారికి వెయ్యవచ్చని నిరూపించిందని ఆమె పేర్కొన్నారు. అలాగే, అంతకంటే తక్కువ వయసువారిపై ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. మరికొన్ని నెలల్లో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అనుమతి పొందే అవకాశం ఉందని ఆమె వివరించారు. 

పిల్లలకు సంబంధించి ఆస్త్రాజెనెకా లాంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు కాస్త నెమ్మదిగా ఉన్నాయని, అయినప్పటికీ భారత్ లో తయారవుతున్న కొన్ని నాసల్ వ్యాక్సిన్లు గేమ్ చేంజర్లు కాగలవని ఆశిస్తున్నట్లు ఆమె  చెప్పారు. అవి ఇమ్యూనిటీని పెంచేలా ఉంటాయన్నారు. సామూహిక వ్యాప్తి తగ్గినప్పుడు స్కూళ్లు, యూనివర్శిటీలూ తెరచుకోవచ్చు అని చెప్పారు. 

టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆమె సూచించారు. పాఠశాలలో పనిచేసే టీచర్లు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని,  స్కూల్స్ తెరిచిన తర్వాత పిల్లలకి వాళ్ళ వల్ల ఎటువంటి రిస్క్ రాకుండా ఉండాలని ఆమె పేర్కొన్నారు. 

ఇక, దేశంలోని కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ మాత్రమే కాదు… ఇతర వ్యాక్సిన్లు కూడా భారత్ లో తయారవుతాయని చెప్పారు. విదేశీ వ్యాక్సిన్లు ఆగస్ట్, సెప్టెంబర్ సమయంలో భారత్ లోకి వస్తాయని ఆమె  తెలిపారు. అప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరందుకుంటుందని పేర్కొన్నారు.