
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని, ఇది భీకర తుపానుగా మారే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం పేర్కొంది. యాస్ తుఫాన్ క్రమంగా బలపడుతుండటంతో పలు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శనివారం తెలిపింది. యాస్‌గా పిలువబడుతున్న ఈ తుపాను పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్‌ల వైపుగా సాగి ఈ నెల 26వ తేదీ సాయంత్రం బెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటుతుందని రీజినల్ మెటిరోలాజికల్ సెంటర్ (ఆర్‌ఎంసి) డైరెక్టర్ జికె.దాస్ పేర్కొన్నారు.
తుపాను ప్రభావంతో ఈ నెల 26 మధ్యాహ్నం నుంచి బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తూర్పు బంగాళాఖాతం వైపుగా సాగుతుందని తెలిపింది. అనంతరం సోమవారం నాటికి తుపానుగా మారుతుందని పేర్కొంది.
ఆ తరువాత 24 గంటల్లో అది భీకర తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో 26న బెంగాల్, ఒడిశా, సిక్కింలలో స్వల్ప నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్‌ఎంసి డైరెక్టర్ జికె దాస్ పేర్కొన్నారు. 27న భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లద్దని వాతావరణ శాఖాధికారులు సూచించారు.
తుపాను నేపథ్యంలో నేవీ అప్రమత్తంగా ఉందని, ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సాయం అందించేందుకు నౌకలు, యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మెడికల్ సిబ్బంది, గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
తుపాను తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలోని కోస్ట్ గార్డ్ సన్నద్ధమైంది. కోస్ట్‌గార్డ్ ఈస్టర్న్ సిబోర్డు, తూర్పు నౌకాదళం సంయుక్తంగా ముందస్తు చర్యలను ప్రారంభించాయి. తూర్పు సముద్రతీరంలోని ఐసిజి స్టేషన్లు, ఓడలు, విమానాలకు హెచ్చరికలు జారీ చేశారు.
తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, ఓడలు, ప్లాట్‌ఫారాల భద్రతకు ఆయిల్ రిగ్ ఆపరేటర్లను సన్నద్ధం చేయడానికి రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సమన్వయం చేసుకొని పని చేస్తున్నామని కోస్ట్ గార్డ్ ఈస్టర్న్ సిబోర్డు ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవంక, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు అన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి వెల్లడించారు.
రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్ల వేగంతో)తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం