సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ మృతి 

బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (78) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. నాగ్‌పూర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. హిందీ, మరాఠి, భోజ్ పురిలో 150కిపైగా చిత్రాలకు సంగీతం అందించారు. ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో ఆయనకు మంచి ఫేమ్ వచ్చింది. రామ్ లక్ష్మణ్ మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హైన్, 100 డేస్ వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతం సమకూర్చడంలో ప్రసిద్ది చెందారు. 
 
రాజశ్రీ ప్రొడక్షన్ లో అత్యధిక చిత్రాలకు సంగీతం అందించారు. 1975లో మరాఠి చిత్రం పండూ హవల్దార్ సినిమాతో చిత్రరంగంలో అరంగ్రేటం చేశారు. తొలి సినిమాకు సురేంద్ర అనే మిత్రుడితో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో మ్యూజిక్ అందించారు. 
 
1976లోనే విజయ్ పాటిల్ మిత్రుడు సురేంద్ర మరణించారు. ఆయన జ్ఞాపకార్థం రామ్ లక్ష్మణ్ పేరుతోనే విజయ్ పాటిల్ బాలీవుడ్ లో కొనసాగారు. ఆయన మృతిపట్ల లతా మంగేష్కర్ సంతాపం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌ చేశారు. రామ్ లక్ష్మణ్ మృతిపై రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ సంతాపం తెలిపింది.