‘ఇండియన్‌ వేరియంట్‌’గా పేర్కొన్న కంటెంట్ తొలగించాలి 

‘ఇండియన్‌ వేరియంట్‌’గా పేర్కొన్న కంటెంట్ తొలగించాలి 
కరోనా బీ.1.617 వేరియంట్​ను ‘ఇండియన్‌ వేరియంట్‌’గా పేర్కొంటూ ఉన్న సమాచారాన్ని వెంటనే తొలగించాలని కేంద్రం సోషల్‌ మీడియా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ లేఖ రాసింది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ ఇండియన్‌ వేరియంట్‌ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భారత్‌ రకం వేరియంట్‌ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని తప్పుడు సమాచారం ఆన్‌లైన్ వేదికగా వ్యాప్తి చెందుతోందని ఐటీ శాఖ లేఖలో పేర్కొంది. 
 
బీ.1.617 రకం వేరియంట్‌పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చినట్లు గుర్తు చేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న బీ.1.617 నిత్యం వేలాది మందిని బలి తీసుకుంటోంది. అయితే, దీన్ని ‘ఇండియన్​ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్నట్లు మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. 
 
ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. బీ.1.617 అనేది ‘ఇండియన్​ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని, ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్త వహించాలని కేంద్రం సూచించింది. 
 
అయినా సరే, చాలా మీడియా సంస్థలు అత్యుత్సాహంతో బీ.1.617 వేరియంట్​ను ఇండియన్​ వేరియంట్​గా పేర్కొంటూ కథనాలను ప్రచురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
వైరస్, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని.. వాటిని శాస్త్రీయ నామంతోనే గుర్తిస్తామని డబ్ల్యూహెచ్​ఓ ఇటీవల చెప్పిన విషయాన్ని ఉదహరించింది.