
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడని గుర్తించిన పోలీసులు హెచ్చరించి వదిలివేశారు.
ఎగ్మూర్‌లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేసిన అపరిచిత వ్యకి, ఆళ్వార్‌పేట చిత్తరంజన్ వీధిలోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టినట్లు, మరి కొద్దిసేపట్లో పేలనుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసు జాగిలంతో సీఎం ఇంటికి వద్దకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు.
ఈ వ్యవహారంపై తేనాంపేట పోలీసులు కేసు నమోదుచేసి, సైబర్ క్రైం పోలీసుల సహకారంతో ఆ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందని విచారణ చేపట్టారు. విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన భువనేశ్వర్ (26) అనే యువకుడు ఈ చర్యకు పాల్పడ్డాడని గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు భువనేశ్వర్‌ను విచారించి అతడికి మతిస్థిమితం లేదని తెలుసుకొని, అతడి తల్లిదండ్రులను పిలిపించి, మళ్లీ అతడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపారు.
కాగా, భువనేశ్వర్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం, సినీనటులు రజినీకాంత్, విజయ్, అజిత్ తదితరుల ఇళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
More Stories
కూలిన విమాన నిర్వహణలో సంబంధం లేదన్న టర్కీ
ఇరాన్ పై దాడుల్లో ‘షాంఘై సహకార సంస్థ’కు భారత్ దూరం
ఒకసారి పూర్తిగా బోయింగ్ 787 భద్రతా తనిఖీలు