సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చండి 

సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చండి 
యాస్‌ తుపానుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తూ సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికి భరోసా, ధైర్యాన్ని కల్పించాలని సూచించారు. వీటితో పాటు విద్యుత్ అంతరాయాలను తొలగించి, సకాలంలో స్పందించాలని కోరారు. 
 
వర్చువల్‌ ద్వారా వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, టెలికాం విద్యుత్‌, పౌరవిమానయాన అధికారులు పాల్గొన్నారు. యాస్‌ తుపాను సన్నద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రధాని సమీక్షించారు. 
 
ఆయా రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని, ఎక్కువగా ఇబ్బందులున్న ప్రాంతాల్లో్ని ప్రజలను మొదట సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని  సూచించారని పీఎంవో పేర్కొంది. అలాగే సముద్రపు ఒడ్డున ఉంటూ రోజు వారి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారని పీఎంవో పేర్కొంది.
 
నెల 26న ఒడిషా – బెంగాల్ మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో 46 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్రం సిద్ధం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సహాయ చర్యల కోసం నేవీ.. షిప్‌లు, హెలికాప్టర్లు సిద్ధం చేసింది.
 
కాగా, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు. 12వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రన్స్‌ల నిర్వహణపై చర్చ జరిపారు. 
 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై చేపట్టిన చర్యలను కేంద్రానికి ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులను రాజ్‌నాథ్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.