కృష్ణపట్నంలో సంచలనం కలిగిస్తున్న కరోనా మందు!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. 
 
ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో ప్రజల నుండి వత్తిడి రావడంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.
 
ఈ ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ లకు సూచించారు.ఆయుర్వేద మందు విషయంలో తన దృష్టికి వచ్చిన నెల్లూరులో నెలకొన్న పరిస్థితులు, వేలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం ఉపరాష్ట్రపతి వారి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకు వచ్చారు. 

కాగా ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. మందుకోసం జనం భారీగా రావడంతో పంపిణీ కష్టతరంగా మారింది. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి.

కొవిడ్‌ నేపథ్యంలో జనం పొటెత్తుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మళ్లీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా రేపటి నుంచి సువిశాలామైన మైదానంలో మందు పంపిణీకి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి అధికారులను కోరారు.

ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంకు చెందిన బొరిగి ఆనందయ్య  కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడది రోజుకు 4-5వేలకు చేరింది.

 ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతోపాటు పలువురు మేధావుల దగ్గర సలహాలు కూడా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు.