డోనాల్డ్ ట్రంప్‌పై క్రిమిన‌ల్ దర్యాప్తు 

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై  నేరాభియోగ కోణంలో విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. ట్రంప్ వ్యాపార లావాదేవీల విష‌యంలో ఇప్ప‌టికే సివిల్ కోణంలో విచార‌ణ సాగుతున్న‌ది. అయితే ట్రంప్ సంస్థ‌కు చెందిన కేసుల్లో  ఇక నుంచి క్రిమిన‌ల్ కోణంలోనూ విచార‌ణ ఉంటుంద‌ని న్యూయార్క్ అటార్నీ జ‌న‌ర‌ల్ ప్ర‌తినిధి లెటీటియా జేమ్స్ తెలిపారు.

సివిల్ కేసులే కాకుండా క్రిమిన‌ల్ విచార‌ణ కూడా ఉంటుంద‌న్న విష‌యాన్ని ట్రంప్ ఆర్గ‌నైజేష‌న్‌కు తెలియ‌జేసిన‌ట్లు జేమ్స్ చెప్పారు. ట్రంప్ సంస్థ‌లో హోట‌ళ్ల‌తో పాటు గోల్ప్ కోర్సులు ఇంకా అనేక వ్యాపార సంస్థ‌లు ఉన్నాయి.

ట్రంప్ సంస్థ‌లో జ‌రిగిన బ్యాంక్, ఇన్సూరెన్స్ మోసాల‌పై ఇప్ప‌టికే సివిల్ కేసులుగా విచార‌ణ చేప‌డుతున్నార‌ని, అయితే ఇక నుంచి ఆ కేసుల్లో క్రిమిన‌ల్ విచార‌ణ కూడా ఉండ‌బోనున్న‌దని జేమ్స్ తెలిపారు. ట్రంప్ ఆదాయ‌ప‌న్ను ఎగ‌వేత‌ల‌పైన కూడా క్రిమిన‌ల్ కోణంలో విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. 

రుణాలు, ట్యాక్స్ బెనిఫిట్స్ పొందేందుకు ట్రంప్ సంస్థ స‌మ‌ర్పించిన అన్ని ద‌స్తావేజుల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు అటార్నీ జ‌న‌ర‌ల్ తెలిపారు. రాజ‌కీయ క‌క్ష‌తోనే త‌న‌ను టార్గెట్ చేస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్‌పై వ్య‌తిరేక‌త ఉన్నా 69 శాతం రిప‌బ్లిక‌న్లు మాత్రం ఆయ‌న్నే త‌మ పార్టీ నేత‌గా భావిస్తున్నారు.