ఇజ్రాయెల్‌ – హమాస్‌ కాల్పుల విరమణ

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇస్లామిక్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ సైతం ధ్రువీకరించింది.

దీంతో 11 రోజులుగా జరుగుతున్న హింసకు తెరపడినట్లయింది. అల్-అక్సా మసీదు వద్ద నిరసనకారులు, పోలీసుల మధ్య ఈ నెల 10న ఘర్షణ చోటు చేసుకోగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇజ్రాయెల్‌.. హమాస్‌ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరుపగా.. 65 మంది చిన్నారులు సహా 232 మంది పాలస్తీనియన్లు మరణించారు. 1,900 మందికిపైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు.

మరో వైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు భారీగా రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్‌లో 12 మంది వరకు మరణించగా వందల సంఖ్యలో జనం గాయపడి, చికిత్స పొందుతున్నారు.   వైమానికదాడుల్లో పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు నిరాశ్రయులవగా  వేలాది సంఖ్యలో గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుపై అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. మొదటి నుంచి మద్దతుగా ఉన్న అమెరికా సైతం హింసను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించించింది.  ఇరుపక్షాలు దాడులు తక్షణం ఆపివేయాలంటూ ఇస్లామిక్‌ దేశాలు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తూ రాగా, ఈజిప్ట్‌, ఖతార్‌, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయి.

ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇజ్రాయెల్‌ తీసుకున్న కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొల్పేందుకు ఇదో మంచి అవకాశమని పేర్కొన్నారు. దాడుల్లో మృతి చెందిన ఇజ్రాయెల్‌, పాలస్తీనియన్లకు సంతాపం ప్రకటించారు.

మరో వైపు కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇద్దరు ప్రతినిధులను పంపనున్నట్లు ఖైరో తెలిపింది. కాల్పుల విరమణ ప్రకటనతో దక్షిణ గాజా ప్రాంతంలోని వీధుల్లో పాలస్తీనియన్లు సంబురాలు జరుపుకున్నారు.