సహజీవనం ఆమోదయోగ్యం కాదు

సహజీవనం ఆమోదయోగ్యం కాదు

సహజీవనం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని పంజాబ్ & హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ఓ జంట రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించగా, ఈ విషయమై విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం సహజీవనం ఆమోదయోగ్యం కాదని, సదరు జంటకు రక్షణ కల్పించలేమని తీర్పు చెప్పింది.

సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, వ్యవస్థలో సరికొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది.

గుర్విందర్ సింగ్ (22), గుల్జా కుమారి (19) అనే ఇద్దరు వ్యక్తులు ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. అయితే ఇంటి నుంచి వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని, తమకు రక్షణ కల్పించాలని పంజాబ్ & హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ధర్మాసనానికి తెలిపారు. 

అయితే ఈ విషయమై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జీ జస్టిస్ హెచ్ఎస్ మదాన్.. ‘‘ప్రస్తుత పిటిషన్‌ను వేసిన వారు తమ సహజీవనంపై ఆమోదం కోరుతూనే వారికి రక్షణ కావాలని అర్జిస్తున్నారు. ఇది నైతికంగా, సామాజికంగా ఎంత వరకూ ఆమోదయోగ్యం కాదు. ఈ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబడవు’’ అని తీర్పు వెలువరించారు. 

అంతే కాకుండా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే విషయమై 2018 మేలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మరోలా ఉంది. నచ్చిన వారితో సహజీవనంలో ఉండడం జీవించే హక్కు కిందకు వస్తుందని, దానికి పెళ్లితో సంబంధం లేదని వ్యాఖ్యానించింది.