కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాతే టీకా తీసుకోవాలని కేంద్రప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా సోకినవారు కోలుకున్న 4 నుంచి 8 వారాలలోపు టీకా తీసుకోవాలన్న నిబంధనను మారుస్తూ మూడు నెలలకు గడువు పెంచారు. తొలి డోసు వేసుకున్నాక కోవిడ్ సోకితే, కోలుకున్న మూడు నెలలకు రెండో డోసు తీసుకోవాలి. ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలి.
ఇతర తీవ్ర వ్యాధులతో ఆసుపత్రి, ఐసియులో చికిత్స అవసరమైన వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి. బాలింతలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కరోనా నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తరువాత రక్తదానం చేయొచ్చు.
వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరం లేదు. గర్భిణులకు కరోనా టీకా అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ విధానంలో తాజా మార్పులను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష