గుజరాత్‌లో ‘తౌక్టే’ విధ్వంసం.. నేడు ప్రధాని పర్యటన 

దేశ పశ్చిమతీరంపై విరుచుకుపడిన అతి తీవ్ర తుఫాన్‌ ‘తౌటే’ బలహీనపడి తుఫాన్‌గా మారింది. అది మరింత బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారనున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది.బుధ, గురువారాల్లో ఇది రాజస్థాన్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌వైపు పయనించనున్నదని హోం శాఖ ఒక అడ్వైజరీలో తెలిపింది.

అంతకుముందు తౌటే తుఫాన్‌ గుజరాత్‌, మహారాష్ట్రలలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా, ముంబైలో ముగ్గురు చనిపోయారు. వేలాది చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. 

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన నౌకల్లో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం ప్రతిబంధకంగా మారింది.

తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. విలయంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. 

మొదట గుజరాత్‌, డీయూను సందర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి భావ్‌నగర్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి ఉనా, డీయూ, జాఫరాబాద్‌, మహువా ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం అహ్మదాబాద్‌ చేరుకొని సమీక్ష జరుపుతారు.

తౌటే తుఫాను సోమవారం గుజరాత్‌ వద్ద తీరం దాటడానికి కొన్ని గంటల ముందు ముంబై సమీపంలోని సముద్రంలో కొట్టుకుపోయిన రెండు భారీ నౌకల నుంచి ఇప్పటివరకు 314 మందిని భారత నౌకాదళం, కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రక్షించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం మొత్తం మూడు నౌకలు (బార్జిలు), ఒక ఆయిల్‌ రిగ్‌ కొట్టుకొనిపోయాయి. వీటిల్లో 707 మంది సిబ్బంది ఉన్నారు.

తౌటే తుఫాన్‌తో ముంబైలో రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది. 24 గంటల్లోనే 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మే లో ఈ స్థాయిలో వర్షం కురువడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య 23.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. 

తుఫాన్‌ సంబంధిత ఘటనల్లో ముంబైలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పది మంది గాయపడ్డారు. తుఫాన్‌ ఉద్ధృతికి ముంబై తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి గేట్‌వే ఆఫ్‌ ఇండియాను బలంగా తాకాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. తుఫాన్‌ ధాటికి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సమీపంలో రక్షణ గోడ, ఫుట్‌పాత్‌ దెబ్బతిన్నాయి.