కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్పత్రుల కోసం 86 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన రోగుల పడకలను 2,539 నుండి 6,972 కు, ఐసీయూ బెడ్లను 273 నుండి 573 వరకు, వెంటిలేటర్స్ సౌకర్యంతో కూడిన పడకలను 62 నుండి 296కి పెంచినట్లు వెల్లడించింది.
రైల్వే మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి డి.జే. నరేన్ మాట్లాడుతూ కొవిడ్-19 పోరాటంలో ఏ ఒక్క అవకాశాన్ని భారత రైల్వే వదిలేయడం లేదన్నారు. ఒకవైపు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దేశంలోని ఆయా ప్రాంతాలకు వేగంగా తరలిస్తుండగా మరోవైపు ప్రయాణికుల, సరుకు రవాణాను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
అదే సమయంలో రైల్వే తన అంతర్గత వైద్య సదుపాయాలను మెరుగు పర్చుకుంటుందని చెప్పారు. దేశంలోని 86 రైల్వే ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను భారీగా పెంచే ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
రైల్వే ఆస్పత్రుల్లో ఇప్పటికే నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తుండగా 30 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 52 మంజూరు చేయబడ్డాయని తెలిపారు. అన్ని రైల్వే కొవిడ్ ఆస్పత్రుల్లో త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు. రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మంజూరు చేసేందుకు ప్రతి కేసులో రూ. 2 కోట్ల వరకు అధికారాలను అప్పగించినట్లు నరేన్ తెలిపారు.
గత వారం రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది కాలంగా కొవిడ్-19తో 1,952 మంది రైల్వే ఉద్యోగులు మరణించినట్లు తెలిపారు. ఇంకా 1,000 మందికి పైగా ఉద్యోగులు కొవిడ్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు.
More Stories
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్లో ఉద్రిక్తత
దేశంలో మంకీపాక్స్ తొలి కేసు?.. భయం వద్దన్న కేంద్రం
ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు గ్రామస్థులకే శిక్షణ