వ‌చ్చే ఏడాదిక‌ల్లా హీరో ఎల‌క్ట్రిక్ బైక్‌

వ‌చ్చే ఏడాదిక‌ల్లా త‌మ ఎల‌క్ట్రిక్ బైకుల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధ‌మైంది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించనున్న‌ది. దీని కింద ఎలక్ట్రిక్ మోడల్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. జైపూర్‌లోని ప్లాంట్‌లో ఈ మోడల్‌ను తయారు చేయనున్నారు. ఇందుకోసం జర్మనీకి చెందిన స్టీఫన్‌తో కలిసి పరిశోధన, అభివృద్ధిని ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తున్న‌ది.

హీరో మోటో కార్ప్ సంస్థ తైవాన్‌కు చెందిన గోగోరోతో ఒప్పందం చేసుకున్న‌ది. దీని కింద బ్యాటరీ మార్పిడి వేదికను భారత్‌కు తీసుకురానున్నారు. హీరో బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని హీరో మోటో కార్ప్ విడుదల చేయనుంది. 

ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిని ఎఫ్‌వై 2022 నాటికి, అంటే వ‌చ్చే మార్చిక‌ల్లా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ఈ విభాగంలో మంచి స్థానాన్ని సంపాదించడానికి హీరో మోటోకార్ప్ ఇప్పటికే బెంగళూరు ఎలక్ట్రికల్ వెహికల్ స్టార్టప్ అథర్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టిన‌ట్లు స‌మాచారం. 

జర్మనీ, జైపూర్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఈ ఉత్పత్తిని తీసుకొచ్చే పనుల్ని మొద‌లెట్టాయని గుప్తా చెప్పారు. తైవానీస్ కంపెనీతో పొత్తు పెట్టుకోవడం వ‌ల్ల‌ కంపెనీ సొంత ఉత్పత్తికి బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.