కేజ్రీవాల్, జగన్ లకన్నా ముందుగానే టీకాల సాంకేతికత బదిలీ  

ఢిల్లీ, ఏపీ ముఖ్యమంత్రులు లేఖలు వ్రాయడంతో టీకాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో ఇతర సంస్థలకు టీకాల తయారీకి అనుమతి ఇచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం కొట్టిపారవేసింది. అటువంటి ప్రచారంలో వాస్తవం లేదని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ కూడా స్పష్టం చేశారు.

ముంబైలోని ప్రతిష్ఠాత్మక హాఫ్‌కైన్‌ పరిశోధన, శిక్షణ, పరీక్షా సంస్థ.. యూపీలోని బులంద్‌షహర్‌లో ఉన్న భారత్‌ ఇమ్యునాలజికల్స్‌, బయోలాజికల్‌ కార్పొరేషన్‌ (బిబ్‌ కాల్‌), హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌కు చెందిన హ్యూమన్‌ బయలాజికల్స్‌ సంస్థలలో కోవాగ్జిన్‌ ఉత్పత్తి చేయాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించింది.

హాఫ్‌ కైన్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ కాగా, బిబ్‌ కాల్‌, హ్యూమన్‌ బయోలాజికల్స్‌ కేంద్ర వ్యవసాయ శాఖకు చెందినవి. హాఫ్‌ కైన్‌ సంస్థ భారత్‌ బయోటెక్‌తో కలిసి కోవాగ్జిన్‌ ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈమేరకు తనకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణూస్వరూప్‌ లేఖ రాసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఏప్రిల్‌ 16న వెల్లడించారు. అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ, 154 కోట్లు ఖర్చవుతుండగా మహారాష్ట్ర ప్రభుత్వం 94 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్లు మంజూరు చేశాయి. ఏడాదిలోపు ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేసి 22.8 కోట్ల వాక్సిన్‌  డోస్‌లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది.

అలాగే  కొవాగ్జిన్‌ ఉత్పత్తికి సంబంధించి బిబ్‌ కాల్‌, హ్యూమన్‌ బయోలాజికల్స్‌కు కూడా కేంద్రం ఏప్రిల్‌లోనే అనుమతినిచ్చింది. బిబ్‌ కాల్‌కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇది ప్రతి నెలా 2 కోట్ల డోసుల వాక్సిన్‌ ఉత్పత్తి చేయగలుగుతుంది.

హ్యూమన్‌ బయలాజికల్స్‌ కూడా ఆరునెలల్లోపే కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయగలుగుతుందని, దానికి బీఎ్‌సఎల్‌-3 (బయోసేఫ్టీ లెవల్‌ -3)  సౌకర్యాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇలా వాటికి ఏప్రిల్‌లోనే కేంద్రం కొవాగ్జిన్‌ ఉత్పత్తికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటే  అంతకు కొద్ది నెలల ముందే సన్నాహాలు చేసి ఉంటుందని స్పష్టం అవుతుంది.

ఈ నేపథ్యంలో జగన్‌, కేజ్రీవాల్‌ లేఖ రాసినందువల్లే కేంద్రం కదిలిందని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇవి కాక ప్రైవేట్‌ సంస్థల్లో  కూడా కోవాగ్జిన్‌ ఉత్పత్తి విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వీకే పాల్‌ చెప్పారు.

కాగా, దేశంలో వాక్సిన్‌ కొరత కొద్ది నెలలే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏడు ప్రైవేట్‌ కంపెనీలు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నాయని, మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు కొవాగ్జిన్‌ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయని, మరో నాలుగు  ప్రైవేట్‌  కంపెనీలు కొత్త వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నాయని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వర్గాలు తెలిపాయి. 

స్పుత్నిక్‌ టీకాను మనదేశంలో ఉత్పత్తి చేస్తున్న ఏడు కంపెనీలు  రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెటెరో బయో ఫార్మా, విర్చోబయోటెక్‌, గ్లాండ్‌ ఫార్మా, పనాసియా బయోటెక్‌, స్టెలిస్‌ బయోఫార్మా, శిల్పా మెడికేర్‌. వీటి ద్వారా మూడు నెలల నుంచి ఏడాది లోపు స్పుత్నిక్‌ వాక్సిన్‌ మనకు లభ్యమవుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

అలాగే  సీరం ఇన్‌స్టిట్యూట్‌, బయోలాజికల్‌ ఇవాన్స్‌, జైడస్‌ క్యాడిలా. జెన్నోవా సంస్థలు కూడా కొత్త వాక్సిన్‌ లతో ముందుకు రానున్నాయని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వర్గాలు తెలిపాయి. ఇవి మూడోదశ పరీక్షలు పూర్తి చేసి అనుమతి పొందేందుకు సిద్దంగా ఉన్నాయి. వీటన్నింటి కీ ఎమర్జెన్సీ లైసెన్సులు మంజూరు చేసే అవకాశాలున్నాయి.