ఇద్ద‌రు మంత్రులు అరెస్టు.. సీబీఐ ఆఫీసుకు మ‌మ‌తా

నార‌ద స్టింగ్ ఆప‌రేష‌న్ కేసులో ఇవాళ ఇద్ద‌రు బెంగాల్ మంత్రుల‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. కాసేప‌టి క్రితం సీబీఐ కార్యాల‌యానికి వెళ్లారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ క్యాబినెట్‌లోని ఫిర్‌హ‌ద్ హ‌కీమ్‌, సుబ్ర‌తా ముఖ‌ర్జీల‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

నార‌ద బ్రైబ‌రీ కేసులో వారిని అరెస్టు చేశారు. ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌కు మంత్రి ఇంటికి వెళ్లి ఫ‌ర్‌హ‌ద్ హ‌కీమ్‌ను కేంద్ర బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. తృణ‌మూల్ ఎమ్మెల్యే మ‌ద‌న్ మిత్రా, మ‌రో నేత సోవ‌న్ ఛ‌ట‌ర్జీ ఇండ్ల‌కు కూడా కేంద్ర బ‌ల‌గాలు వెళ్లి అదుపులోకి తీసుకున్నాయి.  

న‌లుగురు తృణ‌మూల్ నేత‌ల‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు సీబీఐకి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధంఖ‌ర్ అనుమ‌తి  ఇవ్వడంతో సిబిడి ఈ చర్యకు పూనుకొంది. స్పెష‌ల్ కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేసిన సీబీఐ ఆ త‌ర్వాత వారిని క‌స్ట‌డీలోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. 

ఇటీవ‌లే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడోసారి సీఎం అయిన మ‌మ‌తా బెన‌ర్జీ క్యాబినెట్‌లో ఫిర్‌హ‌ద్‌, సుబ్ర‌తా ముఖ‌ర్జీలు మంత్రులుగా ఉన్నారు. నార‌ద న్యూస్ చేప‌ట్టిన ఆ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో వీరంతా కెమెరా ముందే ముడుపులు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నలుగురు ఆ సమయంలో మమతా మంత్రివర్గంలో ఉన్నారు. 

ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మిగిలిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సిబిఐ కార్యాలయం వద్దకు వెళ్లారు. కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. “రాజకీయ దురుద్దేశ్యంతో” ఈ చర్యకు పాలపడిన్నట్లు తృణమూల్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ అనుమతి లేకుండా గవర్నర్ అనుమతితో ఏ విధంగా అదుపులోకి తీసుకొంటారని ప్రశ్నిస్తున్నారు.