రఘురామను ఆర్మీ ఆసుపత్రికి తరలించండి

ఎంపీ రఘురామ కృష్ణం రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికు తరలించి, అక్కడ ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. 
 
అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 
 దేశ‌ద్రోహం కేసులో అరెస్టు అయిన రామ‌కృష్ణ రాజును త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ఆర్మీ హాస్పిట‌ల్‌లోనే చికిత్స అందించాలంటూ సుప్రీం త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. 
 
రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్, ఆయనపై కస్టడీలో జరిగిన హింసకు సంబంధించి రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణరావు దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ గువాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 
 
విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 20వ తేదీకి వాయిదా వేసింది. పోలీస్ కస్టడీలో జరిగిన థర్డ్ డిగ్రీ వ్యవహరంపై సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. 
 
తన క్లయింట్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఏపీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించటం అన్యాయమని, దర్యాప్తు అధికారి ఒకరే అయితే న్యాయం ఎలా జరుగుతుందని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజు నడవలేకపోతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
ఈ మొత్తం కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రంలోపు రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.