విదేశీ విరాళాలను రాష్ట్రాలకు పంపించాం

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు విదేశాలు అందజేసిన విరాళాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి 11,058 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 13,496 ఆక్సిజన్ సిలిండర్లు, 19 ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు, 7,365 వెంటిలేటర్లు వచ్చాయని పేర్కొంది. 

వీటిని ఏప్రిల్ 27 నుంచి మే 15 వరకు పంపిణీ చేసినట్లు ఓ  ప్రకటనలో పేర్కొంది.  కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారత దేశానికి విదేశీ ప్రభుత్వాలు, సంస్థలు సహకరిస్తున్నాయని, ఏప్రిల్ 27 నుంచి సాయం అందిస్తున్నాయని తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన పరికరాలు, మందులను కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఆయా ప్రభుత్వాల వనరులు, కృషికి అనుబంధంగా వీటిని ఉపయోగించుకునేందుకు అందజేసినట్లు తెలిపింది.

కజకిస్థాన్, జపాన్, స్విట్జర్లాండ్, ఒంటారియో (కెనడా), అమెరికా, ఈజిప్ట్, బ్రిటిష్ ఆక్సిజన్ కంపెనీ (బ్రిటన్) నుంచి మే 14, 15 తేదీల్లో విరాళాలు వచ్చినట్లు తెలిపింది. ఈ దేశాల నుంచి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 500 వెంటిలేటర్లు/బీఐ-పీఏపీ/సీపీఏపీ, 300 ఆక్సిజన్ సిలిండర్లు, 40 వేల రెమ్‌డెసివిర్ వయల్స్, మాస్క్‌లు, ప్రొటెక్టివ్ సూట్స్ వచ్చాయని తెలిపింది. 

ఇండోనేషియా, లక్జెంబెర్గ్, ఒమన్, దక్షిణ కొరియా, బ్రిటన్, యూఎస్ఐఎస్‌పీఎఫ్, ఫిన్లాండ్, గ్రీస్ నుంచి మే 12, 13 తేదీల్లో 1,506 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 434 ఆక్సిజన్ సిలిండర్లు, 58 వెంటిలేటర్లు/బీఐ-పీఏపీ/సీపీఏపీ వచ్చినట్లు పేర్కొంది. 

వీటిని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించినట్లు వివరించింది. ఈ పంపిణీ ప్రక్రియను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్రంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.