అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీరానికి చేరువ కావడంతో ముంబై తీరంలో వాతావరణం భయానకంగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతూ పరిస్థితిని భీతావహంగా మార్చేశాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ ప్రభావంతో ముంబై నగరం అతలాకుతలం అవుతున్నది. పలుచోట్ల వృక్షాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. శివసేన భవన్ సమీపంలో కూడా గాలివాన ధాటికి కరెంటు స్తంభం విరిగిపడింది. పలు చెట్లు కూలిపోయాయి.
దాంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆర్థిక నగరం, దాని పరిసర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు నేలకొరిగాయి. స్థానిక రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.
నవీ ముంబయిలో ఈ వర్షాలకు ధాటికి ఇద్దరు మృతి చెందారని తెలుస్తోంది. మొత్తంగా ముంబయి, థానే, పల్గార్ జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 12,420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది
ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌కు ఫోన్ చేశారు. మహారాష్ట్రలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గోవా, గుజరాత్ ముఖ్యమంత్రులకు కూడా ఫోన్ చేసి తౌక్తే తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు డామన్ డయ్యూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
తౌటే తుఫాను ప్రభావంతో ముంబై విమానాశ్రయం మూతపడనుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాను పెను తుఫానుగా మారి గుజరాత్‌వైపు పయనిస్తున్నట్టు వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
ఇప్పటికే ఈ తుఫానుతో కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. గుజరాత్‌లో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాను ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకి, మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్- మహువా (భావ్‌నగర్ జిల్లా) ల మధ్య తీరాన్ని దాటనుందని వెల్లడించింది. గుజరాత్ లో తీరప్రాంతంలోని 17 జిల్లాల నుండి 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష