ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని బిజెపి మాజీ ఎమ్యెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్  విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చేసిన దాడి వాస్తవమేననని నివేదిక వస్తే.. దాని అర్థం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నోరు విప్పితే బొక్కలో వేసి, నాలుగు ఉతికి పంపిస్తామని చెప్పడానికి చేసిన ప్రక్రియని బీజేపీ నేత స్పష్టం చేశారు. సొంతపార్టీలో ఉన్నవాళ్లకే ఇలా చేస్తే, ఇక ప్రతిపక్ష నేతల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రంలో కక్ష్య సాధింపులు పెరుగిపోయాయని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఎంపీ రఘురామ వ్యాఖ్యలు ఉన్నాయని ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ న్యాయవ్యవస్థను అస్థిరపర్చడానికి వైసీపీ సోషల్ మీడియాలో న్యాయమూర్తులను ముక్కలు ముక్కలుగా నరికేయాలని చెప్పినప్పుడు అది అస్థిరపర్చడం కాదా? అని ప్రశ్నించారు. 

అలాగే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ప్రశ్నించారు. దానికంటే రాఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా? అని నిలదీశారు. ఒక డిక్టేటర్ షిప్‌గా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించడం సరికాదని ఆయన హితవు చెప్పారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని నేత విష్ణుకుమార్ రాజు సూచించారు. కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి అయినా సమాచారం తీసుకోవాలని హితవు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని మాట్లాడనివ్వరని, కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని ‘ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి’అని ఆయన ధ్వజమెత్తారు. 

ఇలా ఉండగా, రాష్ట్ర పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు గారి చిత్రాలు కలతపెట్టేవిగా ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుడిని ఈ విధంగా రాష్ట్ర పోలీసులు వేధించగలిగితే, రాష్ట్రంలోని సాధారణ ప్రజల స్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.  ఈ దారుణానికి కారణమైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి రాజకీయ క్రూరత్వాన్ని చూపించడం అప్రజాస్వామికం,  ఆమోదయోగ్యం కాదని వీర్రాజు స్పషట్మ చేసారు. వైసిపి ప్రభుత్వం తన ప్రతీకార చర్యలను ఆపి, ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజకీయంగా ప్రేరేపించిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.