కోవిడ్ సంక్షోభానికి భారత్ ప్రతిస్పందన

భారత్ లో కోవిడ రెండవ తాకిడి అతి ఉత్పాతంగా, ప్రాణాంతకంగా పెద్ద ఎత్తున ఎగసి పడింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ శాయశక్తులా ప్రయత్నించినా ఎంతో కొంత కొరతగానే ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మనం ఇప్పుడు చర్చించబోతున్నాము .

కోవిడ్ రెండవ తాకిడిని ఈ ప్రభుత్వం ఊహించలేదా? ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదా ??

ఈ విషయాన్ని చర్చించే ముందు మనం కొన్ని గణాంకాలు పరిశీలించాలి. దాదాపు 01 జనవరి 2021 నుంచి 10 మార్చి 2021 మధ్యలో భారత్ లో సగటున 20,000 కొత్త కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఎక్కువ రోజులు 10000 కొత్త కేసులు నమోదు కూడా అయ్యాయి. ప్రపంచంలో చాలా దేశాలు అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు రెండవ తాకిడి ఎదుర్కొన్నాయి.

కోవిడ మొదటి తాకిడిని సమర్ధవంతంగా ఎదుర్కొని భారత్ రెండవ తాకిడిని దాదాపు దాటినట్లే కనిపించింది. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని తెగ విమర్శిస్తున్న ఈ నిపుణులు, విశ్లేషకులు కూడా ‘మనం రెండవ తాకిడిని తప్పించుకున్నాం ఇంకా లాక్ డౌన్ ఎందుకు’ అంటూ పుంఖానుపుంఖాల వ్యాసాలతో ఊదరగొట్టారు. పైగా మాస్క్ లు ఇంక తీసేయచ్చు కదా. స్కూళ్ళు, కాలేజీలు తెరవచ్చుకదా అంటూ దీర్ఘాలుతీశారు.

ఇక బీబీసి లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థ 15ఫిబ్రవరి 2021 న “భారతదేశంలో కోవిడ మహమ్మారి ఇక అంతం కాబోతోందా??” అంటూ వార్తా కధనం కూడా ప్రసారం చేసింది. ది న్యూయార్క్ టైమ్స్, వాల్  స్ట్రీట్ జర్నల్, మరికొన్ని పత్రికలు ఈ భారతదేశం ఇలా ఎలా విజయం సాధించింది? రెండవ తాకిడిని ఎలా తప్పించుకుంది అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాయి కూడా.

పరిస్థితి ఇంత ఆశాజనకంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఏమి అలసత్వాన్ని ప్రదర్శించలేదు.  జనవరి, ఫిబ్రవరి నెలల్లో 17 సూచనలు, సలహా పత్రాలను (advisories) విడుదల చేసింది . 2021 మార్చి 17న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా, కోవిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాస్కులు, సామాజికదూరం విషయంలో ఎలాంటి వేసలుబాటు ఇవ్వరాదని స్పష్టంగా చెప్పారు. వైద్య సిబ్బందికి, ఇతర వైద్య విభాగాల వారికి మళ్ళా శిక్షణ ఇవ్వాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కూడా .

కానీ ఏం జరిగింది ?? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి? అలసత్వాన్ని ప్రదర్శించినట్టు అనిపిస్తోంది.  ముఖ్యంగా ఈ రెండవసారి తాకిడి మొదలైన మహారాష్ట్ర , కేరళ, ఢిల్లీ , ఛత్తీస్ ఘడ్ , పంజాబ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. అక్కడి ప్రభుత్వాలు తప్పును గ్రహించి, సరిదిద్దుకొనే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోవిడ్ రెండవసారి తాకిడి మొదలైపోయింది. తన ప్రతాపం చూపటం మొదలుపెట్టింది.

అసలు ఈ మహమ్మారి ఇలా విస్తరిస్తుంటే ఎన్నికలు జరపడం అంత అవసరమా??

ఎన్నికలు ఒక రాజ్యాంగ ప్రక్రియ. ప్రతి ప్రభుత్వం ఆరునెలలకు ఒకసారైనా తప్పనిసరిగా సమావేశం కావాలి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, అసోం రాష్ట్రాల శాసనసభలను సుషుప్తావస్థలోనే(suspended animation) ఉంచి అక్కడ కేంద్రపాలన కొనసాగించి ఉంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేది. అది అప్రజాస్వామికం. ఈ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలోనే ప్రపంచంలో అనేక ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికలు జరిగాయి. పైగా బీహార్ రాష్ట్రంలో గత నవంబర్ లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయి కూడా .

సరే ఎన్నికలు నిర్వహణ గురించి కాదు, ఆ బహిరంగ సభలు అవసరమా?? అని ప్రశ్నించుకుందాం. ఇదిగో సరిగ్గా ఇదే విషయాన్ని బీహార్ ఎలెక్షన్స్ ముందు ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చింది బిజెపి. ఈ బహిరంగసభలు కాకుండా, వర్చువల్ సభలు పెట్టుకునే విధంగా చూడండని సూచించింది. అయితే ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఈ ప్రతిపాదన తోసిపుచ్చాయి. వారి అభ్యంతరం ఏమిటంటే ఈ వర్చువల్  విధానంలో బిజేపి బాగా ఆరితేరిపోయింది, దానిని తాము అందుకోలేము కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఉండవు అని. సర్వాంగీకరం లేకపోవటంవల్ల ఎలెక్షన్ కమీషన్ పాత పద్దతిలోనే ప్రచారం జరుపుకోవటానికి అనుమతి ఇచ్చింది .

ఈ విధంగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్ళిన ఐదు రాష్ట్రాల్లో భౌతిక ర్యాలీలతో కొనసాగింది. రాహుల్ గాంధీ కేరళలో భారీ రోడ్ షోలు నిర్వహించారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో తన మెగా ర్యాలీలు నిర్వహించారు. బిజెపి పోటీ చేస్తున్న చోట ర్యాలీలు చేసింది.

కానీ అదేమీ విచిత్రమో, మహారాష్ట్ర లేదా ఛత్తీస్ గఢ్ లేదా ఢిల్లీ లేదా పంజాబ్ లో ఎన్నికలు లేవు, కానీ అక్కడ మార్చి చివరి నాటికి కోవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. కనుక ఎన్నికల సభలవల్ల ఈ ఘోరం జరిగిపోయిందనుకోవటానికే అవకాశం లేదు.

ఇవన్నీ కాదు అసలు హరిద్వార్ లో కుంభమేళా అవసరమా?

కుంభమేళా  భారతదేశంలో చాలా పవిత్రమైన పర్వం. ఈ మేళా తిథులు, సమయం మొదలైనవి  ప్రభుత్వం నిర్ణయించదు. సాధుసంతులు నిర్ణయిస్తారు. జనవరి, ఫిబ్రవరిలో కోవిడ్ కేసులు తగ్గడంతో  ప్రతిపాదించిన తేదీలపై షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.  కోవిడ నెగెటివ్ ఉన్న సర్టిఫికేట్ లేకుండా కుంభ ప్రదేశానికి ప్రవేశము కూడా ఇవ్వలేదు. ఎటువంటి వెసులుబాటు లేకుండా కఠినమైన ఆంక్షలతో నిర్వహించారు.

ఏప్రిల్ 1న కుంభ్ ప్రారంభమైనప్పుడు, భారతదేశంలో రికార్డు అయిన కేసులు 72,000.  ఆరు రాష్ట్రాలు దాదాపు 76% కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్. వీటిలో ఏ రాష్ట్రానికి కుంభమేళాతో సంబంధం లేదు. ఏప్రిల్ 1న ఉత్తరాఖండ్ లో 293 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 8న 1,100 కేసులు నమోదయ్యాయి.

అయితే, ఈ మహమ్మారి దేశవ్యాప్తంగా పెరగడంతో, ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకుని, గడువు తేదీకి ముందే సమావేశాన్ని ముగించాలని సాధువులను అభ్యర్థించారు. వారు ఆ అభ్యర్ధనకు గౌరవమిచ్చి వెంటనే కుంభమేళాను ముగించారు.

భారతదేశపు వ్యాక్సినేషన్ వ్యూహం సరైనదేనా?

దేశీయంగా తయారుచేసిన రెండు వ్యాక్సిన్ లు – కోవిడ్ షీల్డ్, కోవాక్సిన్లకు భారతదేశం అత్యవసర వినియోగఆమోదాన్ని ఇచ్చింది. దీనిలో,కొవాక్సిన్ పూర్తిగా దేశీయమైనది. ప్రధానమంత్రి మోడీ మంజూరు చేసిన ప్రత్యేక కార్యక్రమం కింద, ప్రభుత్వ వైద్య సంస్థ ఐసిఎంఆర్ భారత్ బయోటెక్  భాగస్వామ్యంతో రికార్డు సమయంలో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడమేకాక, వితరణకు సిద్దం చేసింది.  కానీ చాలా బాధ్యతాయుతమైన రాజకీయనాయకులు కూడా కొవాక్సిన్ కు వ్యతిరేకంగా విషప్రచారం చేసినప్పటికీ,  భారతదేశం అధికారికంగా 16 జనవరి 2021 న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించింది.

ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సులకు అనుగుణంగా రూపొందిన వాక్సిన్. ముందుగా డాక్టర్లు, వైద్యసిబ్బంది, ఇతర కోవిడ్ వారియర్స్ కు, వృద్దులకు ఈ వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది; ఫిబ్రవరి 2న ఫ్రంట్ లైన్ వర్కర్ లకు, మార్చ్ 1 నుండి 60 సంవత్సరాలకు పైనబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికీ వాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైంది.

ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, మే 1 నుంచి 18 సంవత్సరాలవారికి వాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటివరకు భారతదేశం 173 మిలియన్ల మందికి టీకాలు వేసింది, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాక్సినేషన్ కార్యక్రమం. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వాక్సిన్ వేసే ఏర్పాట్లు చేశారు.

యుఎస్ఎ, యుకె, ఐరోపాలలోని ఔషధ నియంత్రణదారులు ఆమోదించిన ఇతర వ్యాక్సిన్ లు, రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ లకు కూడా అధికార ఆమోదం లభించింది. వాటిలో  చాలా వరకు భారతదేశానికి చేరుకునే ప్రక్రియలో ఉన్నాయి.

దేశ అవసరాలకు ఉపయోగించకుండా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఎందుకు?

11 మే 2021 నాటికి, భారతదేశం మొత్తం 66.3698 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను విదేశాలకు ఎగుమతి చేసింది. అదే సమయంలో, భారతదేశంలో సుమారు మూడు రెట్లు ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చారు. వాక్సిన్ తయారీదారులు అనేక దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే ఆ దేశాల నుంచి ముడి పదార్థాలు వచ్చాయి.

అంతేకాకుండా, `వసుధైక కుటుంబకం’ అన్న ఆర్యోక్తి భారతదేశపు సంప్రదాయం. అమెరికా, ఫ్రెంచ్ అధ్యక్షులు ఇద్దరూ ఇటీవల ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు కూడా. పోయిన సంవత్సరం కూడా ప్రపంచానికి అవసరమైనప్పుడు, భారతదేశం మందులు ప్రపంచానికి అందించింది కూడా . తత్ఫలితంగానే ఇప్పుడు భారతదేశానికి సహాయం అవసరమైనప్పుడు, ప్రపంచం కృతజ్ఞతాభావంతో తిరిగి ఋణం తీర్చుకుంటోంది .

ఒక మహమ్మారి సమయంలో సెంట్రల్ విస్టాను ఎందుకు నిర్మించాలి?

తీవ్రమైన ఆర్ధిక మాంద్యం తరువాత, వాషింగ్టన్ డిసిని పూర్తిగా పునరుద్ధరించడంతో సహా కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఎందుకు అంత పెట్టుబడి పెడుతున్నారని అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ ను అడిగారు, అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ”మౌలిక సదుపాయాల పెట్టుబడి ఆర్థిక పునరుజ్జీవనానికి ఊతమిస్తుంది.’’

గత సంవత్సరం లాక్ డౌన్, నిరాశాజనక ఆర్థిక కార్యకలాపాల తరువాత, భారత ప్రభుత్వం ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలపై డబ్బును సరిగ్గా ఖర్చు చేస్తోంది, ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది, అనుబంధ రంగాలను ప్రేరేపిస్తున్నది. ఆవిధంగా దిగువన ఉన్నవారు మరింత ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు ఇప్పటికే అనుమతి మంజూరు అయింది. కాబట్టి దానిని ఇప్పుడు నిలుపుచేయడం అనవసరం.

వైద్య మౌలిక సదుపాయాల కొరత తీరిందా?

2020 మార్చ్ 25న భారతదేశంలో 10,180 ఐసోలేషన్ బెడ్ లు ఉన్నాయి. నేడు వీటి సంఖ్య 1.6 మిలియన్ కు పైగా పెరిగింది.  ఇదే కాలంలో ఐసియు పడకలు 2,168 నుంచి 92,000 కు పెరిగాయి.

ప్రస్తుత పరిస్థితి కంటే ముందు భారతదేశం సగటు రోజువారీ వైద్య ఆక్సిజన్ ఆవశ్యకత సుమారు 700  మెట్రిక్ మీటర్లు. కొద్దిరోజుల్లోనే ఆ అవసరం దాదాపు 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే దాదాపు 1,200 శాతం పెరుగుదలన్నమాట. ఇది చాలా పెద్ద సవాలు.  ఉత్పత్తి, సరఫరాను దీనికి తగ్గట్లుగా పెంచడం అంత సులభమేమికాదు. కానీ క్రమంగా ఈ సవాలును అధిగమిస్తుండడంతో సమస్య తీవ్రత తగ్గింది. అయినా కొంత నష్టం మాత్రం తప్పలేదు.

రెమెడిసివిర్ వంటి ఔషధాల ఉత్పత్తి నెలకు సుమారు 4 మిలియన్ల నుండి నెలకు దాదాపు 10  మిలియన్లకు పెరిగింది.

సరఫరాను సజావుగా సాగేట్లు చూడటానికి,  బహుళ నగరాల్లో ప్రత్యేక అత్యవసర వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సాయుధ దళాల సమీకరణను ప్రధాని మోడీ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.

అతిపెద్ద ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రధాని కేర్స్ నిధిని ఏర్పాటుచేశారు. అదే సమయంలో, ఇప్పటికే ఆమోదించిన 162 కాకుండా మరో 551 ఆక్సిజన్ ఉత్పత్తి  ప్లాంట్ లను మంజూరు చేశారు. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి DRDO ఈ  పిఎం కేర్స్ ఫండ్ ను కూడా ఉపయోగిస్తోంది.

అందువలన, మొత్తం 1,200 కంటే ఎక్కువ ప్లాంట్స్ వస్తాయి. దీనివల్ల  దేశంలోని ప్రతి జిల్లాకు త్వరలో వైద్య ఆక్సిజన్ ఉత్పత్తి సదుపాయం లభిస్తుంది. పిఎం కేర్స్ ఫండ్ క్రింద అత్యాధునిక వెంటిలేటర్లను ఏర్పాటు చేయడానికి కూడా అనుమతులు ఇచ్చారు. డిఆర్ డిఒ అభివృద్ధి చేసిన ఎస్ పిఒ2 సెన్సింగ్ ఆధారిత ఆక్సిజన్ నియంత్రణ వ్యవస్థ కూడా సిద్దం చేస్తున్నారు . లక్ష 50వేలకు పైగా ఇటువంటి పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.

800 మిలియన్ల మంది భారతీయులకు ఉచిత ఆహారం, రేషన్ అందించే పధకాన్ని  మరో మూడు నెలల పాటు పొడిగించారు.డిఆర్ డివో అభివృద్ధి చేసిన ఒక కొత్త యాంటీ కోవిడ్ ఔషధం – 2-డీఆక్సీ-డి-గ్లూకోజ్ (2-డిజి) ఇప్పుడే ఆమోదం పొందింది. ఇది చాలా ప్రభావవంతమైన ఔషధమని పరీక్షల్లో తేలింది.

తరువాత ఏమిటి?

భారతదేశం పూర్తి అంకితభావం, సంకల్పంతో రెండవసారి తాకిడిని ఎదుర్కుంటోంది. కొత్త కేసుల నమోదులో ఏడు రోజుల సగటు క్రమంగా తగ్గుతోంది. వైద్య సదుపాయం అవసరమైన వారికి అందించగలుగుతున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కఠిన కోవిడ్ నియంత్రణ ప్రోటోకాల్ అమలుచేస్తున్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశం ఈ క్లిష్టమైన స్థితిని అధిగమించగలదని అంచనా. రెండవ తాకిడిపై భారతదేశం చేస్తున్న యుద్ధంలో నిశ్శబ్దంగా పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్మికులు నిజమైన హీరోలు.  వారి అంకితభావం, సేవ త్వరలోనే ఫలిస్తాయి.

(`గల్ఫ్ న్యూస్’ వ్యాసానికి స్వేచ్చనువాదం)

అనువాదం: చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి