క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశవ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజూ మూడు ల‌క్ష‌ల‌కుపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. క‌రోనా కార‌ణంగా  ప్రతిరోజూ మూడు వేల‌మందికిపైగా బాధితులు మృతిచెందుతున్నారు. అయితే తాజాగా కరోనా సెకెండ్ వేవ్ కాస్త నెమ్మ‌దించిన‌ట్లు క‌నిపిస్తోంది. 

ప్ర‌భుత్వ‌  గణాంకాల ప్రకారం కరోనా కేసుల‌ సంఖ్య గ‌త వారం రోజులుగా త‌గ్గుముఖం ప‌డుతోంది. పాజిటివిటీ రేటు కూడా 20 శాతానిక‌న్నా తగ్గింది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా కాస్త‌ తగ్గింది. అయితే క‌రోనా మృతుల సంఖ్య‌లో పెద్దగా తేడా క‌నిపించ‌డం లేదు. మృతుల సంఖ్య శనివారం మరోసారి నాలుగు వేలు దాటింది.

గ్రామీణ భారతదేశంలో క‌రోనా పరిస్థితులు మ‌రింత‌గా క్షీణిస్తున్నాయి. కరోనా టెస్టుల సంఖ్య కూడా త‌గ్గింది. గడ‌చిన ఏడు రోజుల కేసుల‌ను ప‌రిశీలిస్తే సుమారు 50 వేల వ‌ర‌కూ కేసులు త‌గ్గాయి. మే 8 న 3.91 ల‌క్ష‌ల కేసులు న‌మోదు కాగా,  శనివారం నాటికి ఈ సంఖ్య 3.54 లక్షలకు పడిపోయింది. దీనిని గ‌మ‌నించిన నిపుణులు క‌రోనా సెకెండ్ వేవ్ కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని భావిస్తున్నారు.

కాగా, దేశంలో జూలై మాసాంతం నాటికి 51.6 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నామని చెప్పారు.

ఆ మేరకు జూలై నాటికి దేశవ్యాప్తంగా 51.6 కోట్ల మందికి టీకా వేయిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఆగస్టు-డిసెంబర్‌ మధ్య కాలంలో 216 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయని హర్షవర్ధన్‌ తెలిపారు.

ఇలా ఉండగా, కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే విజయ్‌ రాఘవన్‌ స్పష్టం చేశారు. 

రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన వ్యాధుల నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) ప్రకటించిన మరుసటి రోజే.. ప్రజలను గులేరియా, రాఘవన్‌ అప్రమత్తం చేశారు. ‘మరింత డాటా వచ్చేవరకైనా మనం జాగ్రత్తగా ఉండాలి. కరోనా వైరస్‌ చాలా తెలివైనది. మ్యుటేషన్లతో రూపం మార్చుకుంటున్నది. కొత్త వేరియంట్ల నుంచి వ్యాక్సిన్లు కల్పించే రక్షణ ఏమిటనేది చెప్పలేం. కాబట్టి నిబంధనలను కొనసాగించాల’ని గులేరియా తెలిపారు.