చౌకగా ఇస్రో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు 

దేశాన్ని ఊపిరాడనీయకుండా చేస్తున్న కరోనా వైరస్‌తో పోరాడేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కూడా రంగంలోకి దిగింది. కరోనా రోగుల కోసం శ్వాస్‌ పేరుతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను, ప్రాణ పేరుతో వెంటిలేటర్‌ను అత్యంత తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసింది. 
 
ఇస్రోకు చెందిన యువ శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారని, వీటి ధర బహిరంగ మార్కెట్‌లో కంటే తక్కువే ఉండేలా తయారుచేశామని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. 
 
వీటి టెక్నాలజీని తయారీ సంస్థలకు ఉచితంగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమను సంప్రదించాయని ఆయన వెల్లడించారు. ‘ప్రాణ’ ధరను సుమారు లక్ష రూపాయలు (మార్కెట్‌ ధరతో పోలిస్తే మూడింతలు తక్కువ), ‘శ్వాస్‌’ ధరను రూ. 50 వేల లోపే అందజేస్తామని చెప్పారు.
శ్వాస్‌ నిమిషానికి పది లీటర్ల ఆక్సిజన్‌ను అందిస్తూ ఏకకాలంలో ఇద్దరు రోగులకు ప్రాణవాయువును అందజేస్తుందని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనలను అనుసరించి వీటిని రూపొందించామని సోమనాథ్‌ తెలిపారు.