మోదీపై విమర్శలతో పోస్టర్లు… 15 మంది అరెస్ట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలతో ముద్రించిన పోస్టర్లను అతికించిన 15 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై 17 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ విషయంలో మోదీపై విమర్శలతో ఈ పోస్టర్లను రూపొందించినట్లు పోలీసులు ఆరోపించారు.

‘‘మోదీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు?’’ అని ఈ పోస్టర్లలో ఉందని, వీటిని నగరంలోని చాలా ప్రాంతాల్లో అతికించారని తెలిపారు. ఈ పోస్టర్ల గురించి గురువారం సమాచారం అందిందని, జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

వేర్వేరు ఫిర్యాదులపై 17 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసినట్లు తెలిపారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 188 (ప్రభుత్వ అధికారి ప్రకటించిన ఆదేశాల పట్ల అవిధేయత ప్రదర్శించడం), తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ అంశంపై తదుపరి ఫిర్యాదులు వస్తే, వాటి ఆధారంగా కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు శనివారం చెప్పారు. ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈశాన్య ఢిల్లీలో ఇద్దర్ని అరెస్టు చేసి, మూడు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశామని పేర్కొన్నారు. ఔటర్ ఢిల్లీలో మూడు, సెంట్రల్ ఢిల్లీలో రెండు, రోహిణిలో రెండు, తూర్పు ఢిల్లీలో ఒకటి, సహద్రలో ఒకటి, ద్వారకలో ఒకటి, ఉత్తర ఢిల్లీలో ఒకటి, పశ్చిమ ఢిల్లీలో మూడు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసినట్లు చెప్పారు.