
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గుట్టలుగా పడేయడం, సామూహికంగా దహనం చేయడం వంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండడం పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. చనిపోయినవారి గౌరవాన్ని నిలుపాలని, దీని కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
సామూహిక ఖననాలు, దహనాలు వద్దని, రవాణా సమయంలో మృతదేహాలను కుప్పలుగా పడేయవద్దని ఎన్‌హెచ్ఆర్సీ పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల చనిపోయినవారి గౌరవ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించి ఉన్నవారికి మాత్రమే కాకుండా చనిపోయినవారికి కూడా వర్తిస్తుందని కమిషన్ తెలిపింది.
“మరణించినవారి హక్కులను పరిరక్షించడం, మృతదేహాల పట్ల జరిగే నేరాలను నిరోధించడం ప్రభుత్వాల విధి ” అని స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శశ్మానవాటికలకు కరోనా మృతదేహాలు పోటెత్తుతుండటంతో అత్యవసరంగా తాత్కాలిక దహనవాటికలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ఆర్సీ సూచించింది.
సామూహిక దహన సంస్కారాలతో వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉన్నందున విద్యుత్ దహనవాటికలను ప్రోత్సహించాలని పేర్కొంది. శ్మశానవాటికల్లోని సిబ్బంది మృతదేహాలపట్ల అగౌరవంగా ప్రవర్తించకుండా చూడాలని, దీని కోసం వారికి తగిన సురక్షిత పరికరాలు అందజేయాలని సూచించింది. అప్పుడు వారు ఎలాంటి భయందోళన లేకుండా తమ విధులు నిర్వహించగలరని పేర్కొంది.
మృతదేహాలను ముట్టుకోకుండా నిర్వహించే పవిత్ర జలం, పువ్వులు చల్లడం, బైబిల్ చదవడం వంటి మతపరమైన క్రియలను అనుమతించాలని ఎన్‌హెచ్ఆర్సీ తెలిపింది. కరోనాతో చనిపోయిన వారి బంధువులకు వైరస్ సోకినప్పడు లేదా భయంతో అంత్యక్రియల కోసం ముందుకు రానిపక్షంలో మృతదేహాలకు వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేలా అధికారులు చూడాలని తెలిపింది.
కరోనా మరణాలే కాకుండా అన్ని మరణాల నమోదుకు జిల్లాల వారీగా డిజిటల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ సూచించింది. విపత్తుల సమయంలో మరణించిన, కనిపించకుండా పోయిన వారిని ఇతర విధానాల్లో పక్కాగా గుర్తించాలని, అలాంటి సమాచారం పట్ల అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది.
అలాగే ఎలాంటి మోసాలకు దారితీయకుండా ఉండేందుకు మరణించిన వారికి సబంధించిన ఆధార్, పాన్, ఓటర్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, బీమా పత్రలు వంటివి అన్నింటిని డిజిటల్‌గా అప్‌డేట్ చేయాలని ఎన్‌హెచ్ఆర్సీ సూచించింది. ఈ మేరకు చేసిన సమగ్ర సూచలను కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్య శాఖతోపాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు శుక్రవారం పంపింది.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి