కోర్టు ఆదేశాలు బేఖాతరు….రఘురామ జైలుకు తరలింపు

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ  నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజును జీజీహెచ్ నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక ఆయనను నేరుగా జిల్లా జైలుకు తరలించారు.
ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ అయిపోయాక రమేష్ ఆసుపత్రిలో ఉంచి ఆయనకు చికిత్స కొనసాగించాలని సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినా పట్టించుకోలేదు. 
 
రాజుకు 14 రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగయ్యే వరకు జైలుకు తరలించొద్దని సీఐడీ కోర్టు నిన్ననే ఆదేశించింది.ఆయన ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు వై కేటగిరీ భద్రత కల్పించాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. 
 
ఈ నేపధ్యంలో రఘురామకృష్ణరాజును  వైద్య పరీక్షల కోసం ఉదయమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపారు. రాజుకు వైద్య పరీక్షలు జరుగుతున్న తరుణంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. 18 రకాల  వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతభారీ బందోబస్తుతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. 
 
జైలు వద్ద ఎలాంటి ప్రతిఘటన గాని.. నిరసన గాని ఎదురుకాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది.  జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు వెళ్లింది. జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నివాసానికి జిల్లా కోర్టు ప్రత్యేక మెసెంజర్‌ యాప్‌ ద్వారా నివేదికను పంపింది. 

కాగా, జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ రాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే  పట్టించుకోవడం లేదని వాపోయారు. 

ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారని, ప్రజా సమస్యలపై ప్రశ్నించేవాళ్లని జైల్లో పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.