ఫ్ఫైజర్ వ్యాక్సిన్ ధరల విధానంపై పెను దుమారం 

ఫ్ఫైజర్ వ్యాక్సిన్ ధరల విధానంపై పెను దుమారం 

మానవాళి తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఫ్ఫైజర్ వ్యాక్సిన్ నిర్లక్ష్యపూరిత ధరల విధానంపై పెను దుమారం చెలరేగుతుంది.   అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు అతి పెద్ద విషాదానికి, సంపన్న దేశాలు భారీ నష్టాలకు గురయ్యే విధంగా ఈ కంపెనీ కోవిడ్-19 వ్యాక్సిన్ల కేటాయింపు, ధరల నిర్ణయ విధానం ఉందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

‘కొనగలిగినవాడికే అమ్ముకో’ అనే విధానాన్ని అనుసరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే, దానిని అందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవాక్స్ ఏర్పాటైంది. అన్ని దేశాలకు న్యాయంగా, సమానంగా వ్యాక్సిన్లను అందజేయాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.

కోవిడ్ వ్యాక్సిన్ 2 బిలియన్ల డోసులను సేకరించి, పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి దేశానికి అవసరమయ్యే వ్యాక్సిన్ డోసుల్లో 20 శాతం 2021లో అందజేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. అన్ని దేశాల్లోని బలహీన వర్గాలకు వ్యాక్సిన్లను చేరువ చేయాలనుకుంది. ఈ వ్యాక్సిన్‌ను తీసుకునే దేశపు ఆదాయ స్థాయికి అనుగుణంగా ఒక మోతాదు టీకాకు ఒక డాలర్ లేదా రెండు డాలర్లు లేదా 3 డాలర్లుగా ధరను నిర్ణయించింది.

ఫ్ఫైజర్ విధానాల వల్ల సంపన్న దేశాలు వ్యాక్సిన్లను సొంతం చేసుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న 90కి పైగా దేశాలకు ఫ్ఫైజర్ వ్యాక్సిన్ దొరకలేదు. ప్రపంచంలో అత్యధిక తలసరి జీడీపీ కలిగిన దేశాలకే ఫ్ఫైజర్ వ్యాక్సిన్ చేరింది. కోవాక్స్ సూచించిన ధర కన్నా పది రెట్లు అంటే ఒక మోతాదు టీకాకు 20 డాలర్ల చొప్పున ఫ్ఫైజర్ అమ్ముకుంటోంది.

ఈ ధరకు అయినా తేలిగ్గా ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ దేశానికి కావలసిన వ్యాక్సిన్ కోసం 16సార్లు ఫ్ఫైజర్ సీఈఓకు ఫోన్ చేయవలసి వచ్చిందని వాపోయారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అమెరికాలోని వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరర్లకు ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా ఉదారంగా ఆర్థిక సాయం చేశాయి.

ఫ్ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు పునాది వంటి mRNA టెక్నాలజీ కోసం కృషి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐహెచ్)లో జరిగింది. ఈ టెక్నాలజీ అభివృద్ధిలో ఎన్ఐహెచ్ ల్యాబ్ టెక్నీషియన్ కటలిన్ కరికో కీలక పాత్ర పోషించారు. ఫ్ఫైజర్‌కు అమెరికా ప్రభుత్వం అడ్వాన్స్‌గా 1.95 బిలియన్ డాలర్లు ఇచ్చింది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫ్ఫైజర్ వ్యాక్సిన్‌ను తయారు చేసినది ఆ కంపెనీ కాదు. దీనిని బయోఎన్‌టెక్ అనే జర్మన్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ కంపెనీలకు విరాళాలిచ్చిన ప్రైవేటు ఫౌండేషన్లకు పన్ను ప్రయోజనాలు లభించాయి. ఆ మేరకు ఆ ఫౌండేషన్ల సొమ్ము పబ్లిక్ ఫండ్ స్వభావాన్ని సంతరించుకుంది.

పబ్లిక్ ఫండ్స్‌ నుంచి వచ్చే విజ్ఞానం, ఉత్పత్తులు పబ్లిక్ గూడ్స్ అవుతాయి. కాబట్టి వ్యాక్సిన్లు అందుకు అతీతం కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఫండింగ్‌ చేసేవారు ఈ కంపెనీలతో ఫైనాన్షియల్ అరేంజ్‌మెంట్స్‌లో స్పష్టంగా పబ్లిక్ గూడ్స్ కాన్సెప్ట్‌ను రాయకపోవడం వల్ల ఆ నిధులను కార్పొరేట్ షేర్‌హోల్డర్లకు మళ్లించడం సులువవుతోందని కొందరు చెప్తున్నారు.

నష్టాలను సమాజానికి వదిలిపెట్టి, లాభాలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మానవాళి చరిత్రలో అతి పెద్ద మహమ్మారి సమయంలో ప్రజలను కాపాడటానికి ఏకైక ఆయుధం వ్యాక్సిన్ కాగా, దానిని లక్షలాది మంది అమాయకులకు ఇచ్చేందుకు ఫ్ఫైజర్, మోడెర్నా ముందుకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, దాదాపు 40 దేశాలు తమ జనాభాలో కనీసం 1 శాతం మందికైనా వ్యాక్సినేషన్ చేయించలేకపోతున్నాయి. ఈ కంపెనీలు ఖర్చు చేసిన సొమ్ముతో పొంతన లేకుండా వ్యాక్సిన్లకు ధరలను నిర్ణయించాయని మండిపడుతున్నారు.

కోవాక్స్‌కు కేవలం 2.5 శాతం వ్యాక్సిన్లను మాత్రమే ఈ కంపెనీలు ఇచ్చాయని, నివారించదగిన మరణాలు సంభవించడానికి కారణం ఫ్ఫైజర్ నిర్లక్ష్యపూరిత విధానాలేనని ఆరోపణలు వస్తున్నాయి.