స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసు ధ‌ర రూ.995

ర‌ష్యాకు చెందిన స్పుత్నిక వి వ్యాక్సిన్ ఒకొక్క డోసు ధ‌ర‌ను రూ.995.40కు లభ్యం కానున్నట్లు  డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ వెల్లడించింది. ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకున్న టీకాల‌కు ఈ ధ‌ర ఉంటుంద‌ని, భారత్ లో  త‌యారయ్యే వాటికి త‌క్కువ ధ‌ర ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 
 
ఇప్ప‌టికే హైద‌రాబాద్‌ కు చేరిన ఈ టీకా ఎమ్మార్పీని రూ.948గా నిర్ణ‌యించ‌గా, దానికి 5 శాతం జీఎస్టీ క‌లిపితే ధ‌ర రూ.995.40 అవుతుంది. ఈ టీకా తొలి డోసును ఇప్ప‌టికే హైద‌రాబాద్ వ్య‌క్తికి వేసిన‌ట్లు రెడ్డీస్ ల్యాబ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
 
ఈ నెల 1వ తేదీనే ల‌క్ష‌న్న‌ర స్పుత్నిక్ వి టీకాలు హైద‌రాబాద్‌లో దిగిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే కొద్ది నెల‌ల్లో మ‌రిన్ని డోసులు దిగుమ‌తి అవుతాయ‌ని, త్వ‌ర‌లోనే భారత్ లోనూ  ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభిస్తామ‌ని చెప్పింది.  దీనికి కసౌలిలోని సెంట్రల్స్ డ్రగ్స్ లేబొరేటరీ ఈనెల 13న రెగ్యులేటరీ క్లియరెన్స్ ఇచ్చింది. 
 
వచ్చే వారం నుంచి స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్రం గురువారం తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు లభిస్తున్నాయి. 
 
వాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రష్యా వాక్సిన్ రాకతో ఆ కొరత తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్-వీ  భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించబడిన మూడవ టీకా కానున్నది.