ముంబైలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఛేదించింది. ఆ ముఠా నుంచి రూ.1,745 కోట్ల విలువైన 349కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే ముఠాలను అణచివేయాలని నిర్ణయించుకున్నట్లు అమిత్‌షా తెలిపారు.
ఇందులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం మోపిందని చెప్పారు. ఎన్‌సీబీ ఓ చిన్న సరుకు ఆధారంగా వెళ్లి భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించటం ‘బాటమ్-టు-టాప్’ విధానానికి ఓ అద్భుత ఉదాహరణ అని అమిత్ షా పేర్కొన్నారు. దీనిని ఒక అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌పై సాధించిన ఒక పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎన్‌సీబీ బృందాన్ని అభినందించారు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, డ్రగ్ ట్రాఫికర్ సలీం డోలాను తుర్కియే నుంచి భారత్‌కు తరలించిన కొన్నిరోజులకే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
కాగా, రెండు రోజుల క్రితమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 11.4 కిలోల క్రిస్టల్‌మెత్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.11.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా, ట్రాలీ బ్యాగులతో అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు మహిళలను గమనించారు. వారిని ఆపి తనిఖీలు చేపట్టగా బ్యాగుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్ ఆసియా విమానంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 6.15 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 16 సీల్డ్ ప్యాకెట్లలో దీనిని తెస్తుండగా తనిఖీలు చేపట్టి అధికారులు పట్టుకున్నారు.

More Stories
వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.993 పెంపు
ఏడు రేట్లు పెరగనున్న ఈపీఎఫ్ కనీస పెన్షన్
భారత్ కు ప్రత్యేక మార్గంలో యూఏఈ చమురు