పిఎం ఇ-డ్రైవ్‌ పథకం కింద రాష్ట్రాలకు 14 వేల ఎలక్ట్రిక్‌ ‌బస్సులు

పిఎం ఇ-డ్రైవ్‌ పథకం కింద రాష్ట్రాలకు 14 వేల ఎలక్ట్రిక్‌ ‌బస్సులు
రాష్ట్రాలకు కొత్తగా ఎలక్ట్రిక్‌ ‌బస్సుల పథకాన్ని కేంద్రం తీసుకువస్తోంది. పిఎం ఇ-డ్రైవ్‌ ‌కార్యక్రమం కింద 14వేల బస్సులకు టెండర్లు, కేటాయింపులు పూర్తయ్యాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. రూ.10,900 కోట్ల వ్యయంతో చేపడుతున్న పిఎం ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ ‌రివల్యూషన్‌ ఇన్‌ ఇన్నొవేటివ్‌ ‌వెహికల్‌ ఎన్‌‌హేన్స్‌‌మెంట్‌ (‌పిఎం ఇ-డ్రైవ్‌) ‌పథకం కింద, దాదాపు సగం కేటాయింపుతో అంటే రూ.4,391 కోట్లతో 14,028 ఎలక్ట్రిక్‌ ‌బస్సులను కొనుగోలు చేస్తారు. 
 
ఈ 14వేల బస్సులకు విజయవంతంగా టెండర్లు పిలిచి, రాష్ట్రాలకు కేటాయించారు. రాబోయే రెండు మూడేళ్ళలో ఈ బస్సులు రాష్ట్రాలకు అందుతాయి. ప్రజా రవాణాను విద్యుద్దీకరణ చేసే దిశగా ఇదొక పెద్ద ముందడుగు అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఒకవేళ రాష్ట్రాలకు మరిన్ని బస్సులు కావాలని అడిగితే వారి కోసం ప్రస్తుత పథకాన్ని పొడిగించడమా లేక కొత్తదాన్ని ప్రారంభించడమా అనేది ఆలోచిస్తామని చెప్పారు. 
 
ఇంత పెద్ద మొత్తంలో బస్సులను నిర్వహణలోకి తేవడమనేది రాష్ట్ర రవాణా సంస్థలతో సహా నిర్వాహకులందరికీ గణనీయమైన సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డిపోల సామర్ధ్యం, రూట్‌ ప్రణాళిక వంటి విషయాలు ఇబ్బందికరంగా వుండవచ్చని తెలిపారు. ఈ బస్సులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు మార్గంలో, అలాగే డిపోల్లో విద్యుద్దీకరణ వంటి అంశాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలని చెప్పారు. 
 
ఇక చార్జింగ్‌ ‌గన్స్‌ ‌వంటి మౌలిక సదుపాయాలను బిడ్డర్లు చూసుకోవాల్సి వుంటుందని చెప్పారు. ఎలక్ట్రిక్‌ ఆటోలకు సంబంధించి ప్రభుత్వ లక్ష్యం 20 నుండి 30శాతంగా వుండగా, మార్కెట్‌‌లో ఇప్పటికే 34 శాతం చొచ్చుకుపోయాయని చెప్పారు.