తమ సర్వీసులను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన విమానయాన సంస్థ స్పిరిట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలుచేయనున్నట్లు వెల్లడించింది. ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఇంధన ధరల కారణంగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకుంటుంటే, మరికొన్ని టికెట్ల రేట్లు పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో స్పిరిట్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని విమాన సర్వీసులను రద్దు చేశామని, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. అయితే ఇతర విమానయాన సంస్థల్లో ప్రయాణ బుకింగ్‌లకు ఎలాంటి సాయం చేయబోమని స్పష్టం చేసింది. 34 ఏళ్లుగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది. రోజూ వందలాది సర్వీసులను నడుపుతూ సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించింది.
కరోనా తర్వాత పెరిగిన నిర్వహణ ఖర్చుల వల్ల ఈ ఎయిర్‌లైన్స్ పలు ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బందులు పడుతోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల జెట్ ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఆగస్టు 2025 నాటికి స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు 8.1 బిలియన్ డాలర్ల అప్పులు, 8.6 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితి నుంచి రక్షణ కల్పించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. తమ ఎయిర్‌లైన్స్ మూసివేత వల్ల సుమారు 17 వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని స్పిరిట్ న్యాయవాది మార్షల్ హ్యూబ్నర్ పేర్కొన్నారు.

More Stories
30 శాతం లాభాలొస్తున్నా పెట్టుబడులు పెట్టని ప్రైవేట్ రంగం
బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు
70 కోట్ల మార్కును దాటిన ఫోన్‌పే రిజిస్టర్డ్ యూజర్లు