భారత్ కు అనిల్ అంబానీ స్విస్ బ్యాంకు వివరాలు 

రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి మరో షాక్‌ తగిలింది. ఆయనతో పాటు ఆయన సతీమణి టీనా అంబానీ, కుమారులు జయ్‌ అన్‌మోల్‌, జయ్‌ అన్షూల్‌ల స్విస్‌ బ్యాంకుల ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి అందించేందుకు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ కోర్టు అంగీకరించిట్లు స్విస్‌ మీడియా వెల్లడించింది. 
 
అనిల్‌ అంబానీ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలు పొందేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని ఫారిన్‌ టాక్స్‌, రీసెర్చ్‌ డివిజన్‌..స్విస్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఏప్రిల్‌ 29న కోర్టు ఉత్తర్వులు వెలువడినట్లు స్విస్‌ పత్రిక గోథమ్‌సిటీ రాసిన కథనంలో పేర్కొంది. 
 
బహిరంగంగా వుంచిన కోర్టు ఉత్వరుల్లో అనిల్‌ అంబానీ కుటుంబం పేర్లను ‘ఎ,బి,సి,డి’గా చూపించారని, ఆ పేర్లు అనిల్‌, టీనా, అన్‌మోల్‌, అన్షూల్‌గా కోర్టు రిజిష్ర్టార్‌ కార్యాలయంలో నిర్ధారించుకున్నట్లు గోథమ్‌సిటీ ఆ కథనంలో వివరించింది.
 
తన వద్ద డబ్బుల్లేవని, తన సోదరుడు ముఖేశ్‌ అంబానీ సాయంతో జీవిస్తున్నట్లు ఇటీవల అనిల్‌ అంబానీ లండన్‌కోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. చైనా బ్యాంకుల కన్సార్షియం నుంచి అనిల్‌ కంపెనీలు తీసుకున్న 1400 కోట్ల డాలర్ల రుణానికి సంబంధించి 77 కోట్ల డాలర్లు చెల్లించమంటూ లండన్‌కోర్టు ఆదేశించిన సందర్భంగా అనిల్‌ ఈ వివరణ ఇచ్చారు. 
 
అలాగే అనిల్‌ గ్రూప్‌లోని మూడు పెద్ద కంపెనీల బ్యాంకు ఖాతాలను ఫ్రాడ్‌గా వర్గీకరించిన ఎస్‌బీఐ ఇటీవల ఢిల్లీ హై కోర్టులో కేసులు దాఖలు చేసింది.