మమతకు ఓటేయనందుకే దాడులు

దేశమంతా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే పశ్చిమ  బెంగాల్ మాత్రం కరోనా విపత్తుతో పాటు ఎన్నికల తర్వాత హింస రూపంలో రెండు సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదేవ్  ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అధికార పార్టీకి కాకుండా, తమ ఇష్ట ప్రకారం ఓట్లు వేసినందుకే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 

రాష్ట్రంలోని కూచ్ బెహర్ జిల్లాలో ఇటీవల ఎన్నికల తర్వాత హింస జరిగిన పలు ప్రాంతాల్లో గవర్నర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవాళ్లను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.  ఎన్నికల తర్వాత హింసకు సంబంధించి సమాచారం అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం  ఇవ్వలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. 

కేంద్ర పారిశ్రామిక భద్రతా పోలీసులు నలుగురు పౌరులను ఏప్రిల్ 110న  కాల్చివేసిన సీత‌ల్‌కుచిలో మొదటగా పర్యటించారు. ఈ ప్రాంతాలలో నెలకొన్న భయానక పరిస్థితుల పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

“శాంతిభద్రతలు పూర్తిగా భగ్నమైపోయాయి. ఇక్కడ చట్టబద్ధ పాలన లేదు. పోలీసులంటే ప్రజలలో భయం చూసాను. రక్షణ కోసం పోలీసుల వద్దకు వెళ్ళడానికి వారు భయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య విధ్వంసం” అంటూ గవర్నర్ తీవ్రంగా విమర్శించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ఇవ్వలేదన్న  కారణంతో దాడులు చేస్తున్నారని, మహిళలు, పిల్లలను కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్న విధులను నిర్వర్తించి తీరుతానని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఎన్నికల సమయంలోనే రెచ్చగొట్టారని మండిపడుతూ ఇలాంటి ప్రవర్తన సరికాదని హితవు చెప్పారు. బెంగాల్ లో టీఎంసీ దాడులకు భయపడి బీజేపీ కార్యక్రతలు  అస్సాం పారిపోయి శిబిరాలలో తలదాచుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు.  శుక్రవారం తాను ఆ క్యాంపులను కూడా సందర్శిస్తానని తెలిపారు. 

కాగా, గవర్నర్ ధన్ కర్ గురువారం కూచ్ బెహర్ లోని మాతాభంగ నుంచి సిటాల్ కుచికి వెళ్తుండగా, దారి పొడవునా టీఎంసీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. సిటాల్ కుచిలో పలువురు బాధితులను గవర్నర్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమను కాపాడాలంటూ పలువురు మహిళలు ఆయన కాళ్లపై మీద పడి వేడుకున్నారు. తమ ఇండ్లన్నీ లూటీ చేశారని, మగవాళ్లంతా ప్రాణభయంతో ఇండ్లు విడిచి పారిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.