టైమ్స్ గ్రూపు చైర్‌పర్స‌న్‌ ఇందూ జైన్ క‌న్నుమూత‌

టైమ్స్ గ్రూపు చైర్మ‌న్ ఇందూ జైన్ క‌న్నుమూశారు. కోవిడ్ సంబంధిత రుగ్మ‌త‌ల‌తో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు కంపెనీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆమె వ‌య‌సు 84 ఏళ్లు. ఇందూ జైన్ దార్శ‌నికురాలు అని టైమ్స్‌నౌ టీవీ ఛాన‌ల్ యాజ‌మాన్యం కొనియాడింది. 

ఆధ్యాత్మిక‌త‌తో జీవించార‌ని, దాన‌ధ‌ర్మాలు చేశార‌ని, క‌ళ‌ల‌ను అమితంగా ఇష్ట‌ప‌డేవార‌ని, మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడిన‌ట్లు టైమ్స్ నౌ పేర్కొన్న‌ది. ఢిల్లీలో ఆమె తుదిశ్వాస విడిచిన‌ట్లు వ‌ర్గాలు తెలిపాయి. ఇందూ జైన్ మృతి ప‌ట్ల రాజ‌కీయ‌వేత్త‌ల‌తో పాటు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.1999లో ఆమె టైమ్స్ గ్రూపున‌కు చైర్మ‌న్ అయ్యారు.

భిన్న‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆమె ఆక‌ట్టుకున్నారు. టైమ్స్ గ్రూపు అభివృద్ధికి ఆమె ఎంతో దోహ‌దం చేశారు. ద టైమ్స్ ఫౌండేష‌న్‌ను ఆమె 2000 సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేశారు. తుఫాన్లు, భూకంపాలు, వ‌ర‌ద‌లు, మ‌హ‌మ్మారులు, ఇత‌ర సంక్షోభ స‌మ‌యాల్లో టైమ్స్ రిలీఫ్ ఫండ్‌తో ఆమె ఆదుకున్నారు. 

1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్‌ జైన్‌ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్‌ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 016లో ఆమెకు ప‌ద్మ విభూష‌న్ అంద‌జేశారు. త‌న అవ‌య‌వాలు దానం చేయాల‌న్న‌ది ఆమె జీవితాశ‌యం. కానీ కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణించడం వ‌ల్ల ఆమె కోరిక తీర‌లేదు. 2000 సంవ‌త్స‌రంలో యూఎన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మిలీనియం వ‌రల్డ్ పీస్ స‌ద‌స్సులో ఆమె ప్ర‌సంగించారు. 

ఇందూ‌జైన్ మృతి పట్ల  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇందూ జైన్ సమాజ సేవా కార్యక్రమాలు, భారతదేశం పురోగతి పట్ల అభిరుచి,సంస్కృతిపై ఆసక్తి ఉన్న  వ్యక్తి అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇందూ జైన్‌ను జీవితకాల ఆధ్యాత్మిక అన్వేషకురాలు, మార్గదర్శక పరోపకారి, కళల విశిష్ఠ పోషకురాలు అని కొనియాడారు. ఇందూ జైన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు. అమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.