ఇద్ద‌రు బీజేపీ బెంగాల్ ఎమ్మెల్యేలు రాజీనామా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవ‌ల కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం రాజీనామా చేశారు. దాంతో శాసనసభలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ 75 కి పడిపోయింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జగన్నాథ్ సర్కార్, నిసిత్ ప్రమాణిక్ త‌మ‌ రాజీనామా లేఖ‌ను అసెంబ్లీ స్పీకర్ బిమాన్ బెనర్జీకి అంద‌జేశారు. 

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జగన్నాథ్ సర్కార్ శాంతిపూర్ నుంచి, నిసిత్ ప్రమాణిక్ దిన్హాటా నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 292 స్థానాల‌కు గాను టీఎంసీ 213 సీట్లు సాధించగా.. 77 స్థానాల్లో బీజేపీ గెలిచింది.

“మేం పార్టీ నిర్ణయాన్ని అనుసరించాం. మా అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయాలని పార్టీ నిర్ణయించింది” అని నిసిత్ ప్రమాణిక్ రాజీనామా చేసిన అనంత‌రం మీడియాతో చెప్పారు. 

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో పోటీ చేసిన సర్కార్, ప్రమాణిక్ ఇద్దరూ పార్లమెంటు సభ్యులు (రణఘాట్, కూచ్ బెహార్) గా ఉన్నారు. రాష్ట్రంలో అధికారం సాధించ‌క‌పోవ‌డంతో పార్లమెంటులో వీరిద్దరి సభ్యత్వాన్ని నిలుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది.

జ‌గ‌న్నాథ్ స‌ర్కార్‌, నిసిత్ ప్ర‌మాణిక్ రాజీనామాల‌తో శాంతిపూర్, దిన్హాటా స్థానాలకు మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. భారత ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు తేదీల‌ను త్వ‌ర‌లో నిర్ణ‌యించే అవ‌కాశాలు ఉన్నాయి. రూల్ బుక్ ప్రకారం ఉప ఎన్నిక ఆరు నెలల్లోపు జరుగాలి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం నలుగురు లోక్‌స‌భ స‌భ్యుల‌కు టికెట్లు ఇచ్చింది. ఇద్దరు ఎంపీలు లాకెట్ ఛటర్జీ, బాబుల్ సుప్రియో ఓడిపోగా.. వారు ఎంపీలుగా కొనసాగుతారు. గెలిచిన ఎంపీలు ఇద్ద‌రు కూడా ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో వీరు కూడా ఎంపీలుగా ఉంటారు.