కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచానికి తెలియజేయడంలో ముందుగా చైనా, ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వరుసగా విఫలమయ్యాయని స్వతంత్ర అధ్యయన బృందం ఐపీపీపీఆర్ (ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పేండమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్) తన నివేదికలో వెల్లడించింది. శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ఇతర దేశాల రాజకీయ నాయకులు కూడా ప్రస్తుత సంక్షోభానికి కారణమని వ్యాఖ్యానించింది.
డబ్ల్యుహెచ్‌వో సభ్యదేశాల కోరిక మేరకు గత ఏడాది మే నెల్లో ఈ అధ్యయన బృందం ఏర్పాటైంది. దీనికి న్యూజీలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షురాలు, నోబెల్ శాంతి పురస్కారం విజేత ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ నేతృత్వం వహించారు.
అనేక దేశాల మాజీ నేతలు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రీతి సూడాన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. దాదాపు ఏడాదిపాటు అధ్యయనం తర్వాత బుధవారం నివేదికను విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సరైన సమయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనా మహమ్మారి బారి నుంచి ప్రపంచం బయటపడగలిగేదని నివేదిక పేర్కొంది.
డబ్ల్యుహెచ్‌వో, అగ్రదేశాలు మరింత సమన్వయంతో పనిచేసి ఉంటే ఈ స్థాయిలో సంక్షోభం తలెత్తేది కాదని, లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగేవాళ్లమని తెలిపింది. డిసెంబరు 2019లో చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరూ దీనిపై అత్యవసరంగా స్పందించలేదని అభిప్రాయపడింది.
డబ్ల్యుహెచ్‌వో కూడా 2020 జనవరిలోనే కరోనాను మహమ్మారిగా ప్రకటించకుండా మార్చి నెల వరకు నాన్చుడు ధోరణిని ప్రదర్శించిందని విమర్శించింది. ఫలితంగా ఫిబ్రవరి 2020లో కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి పరిస్థితి చేజారిపోయిందని తెలిపింది. ప్రమాదాన్ని గుర్తించి త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో అనేక దేశాలు అలసత్వం ప్రదర్శించాయని పేర్కొంది.
కాగా, కరోనా వ్యాక్సిన్ల విషయంలో అసమానతలను కూడా నివేదిక బయటపెట్టింది. ఒకవైపు మఽధ్యశ్రేణి, తక్కువ ఆదాయం ఉన్న దేశాలు వాక్సిన్ కొరతతో కొట్టుమిట్టాడుతుంటే, ధనిక దేశాలు తమ జనాభా కం టే 200శాతం ఎక్కువగా వాక్సిన్ డోసులను సమకూర్చుకొన్నాయని పేర్కొంది. పేదదేశాల్లో 1శాతం కంటే తక్కువ ప్రజలకు మాత్రమే వాక్సిన్ డోస్ లభించిందని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ జాతీయవాదం మూలంగానే ఆస్ర్టేలియా, కెనడా, న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, అనేక యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా తమ జనాభాకు అవసరమైన దానికంటే ఎక్కువ వాక్సిన్ డోసులు సమకూర్చుకొన్నాయని నివేదిక తెలిపింది.
పేదదేశాలు కరోనా నుంచి గట్టెక్కాలంటే ధనిక దేశాలు ముందుకొచ్చి వ్యాక్సిన్లను దానం చేయాలని నివేదిక పేర్కొంది. పెద్దఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ, కేసుల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా విషయంలోనూ ఇథియోపియా, కెన్యా, నైజీరియా, ఉగాండాలతోపాటు భారత్ కూడా వెనుకబడిందని ఆక్సిజన్ సరఫరా సరిపడాలేదని ప్యానెల్ తెలిపింది.
More Stories
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు
ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం